Rahul Gandhi Germany Visit: భారతీయ ఇంజనీరింగ్ పట్ల గర్వంగా ఉంది: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:52 PM
జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను సందర్శించారు. ఆ సంస్థ సహకారంతో తయారు చేసిన టీవీఎస్ 450సీసీ బైక్ సహా లేటెస్ట్ మోడల్ కార్లు, రోల్స్ రాయిస్, ఇటాలియన్-ప్రేరేపిత వింటేజ్ బీఎండబ్ల్యూ ఇసెట్టా, మ్యాక్సీ బైక్‌లను రాహుల్ పరిశీలించారు.
జర్మనీలో టీవీఎస్ 450సీసీ బైక్ చూసి చాలా సంతోషిస్తున్నానని, ఇది అద్భుతంగా ఉందని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన.. మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్(Rahul Gandhi Germany visit)ను సందర్శించారు. ఆ సంస్థ సహకారంతో తయారు చేసిన టీవీఎస్ 450సీసీ బైక్( TVS 450cc bike) సహా లేటెస్ట్ మోడల్ కార్లు, రోల్స్ రాయిస్, ఇటాలియన్-ప్రేరేపిత వింటేజ్ బీఎండబ్ల్యూ ఇసెట్టా, మ్యాక్సీ బైక్‌లను రాహుల్ పరిశీలించారు. అనంతరం అక్కడి సిబ్బందితో కాసేపు ముచ్చటించి.. కొత్త మోడల్స్ వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం భారత తయారీ రంగం (Manufacturing) గురించి మాట్లాడుతూ.. మన దేశంలో ఉత్పత్తి మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
‘ మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను సందర్శించాను. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వాళ్ల దగ్గర ఉన్న టీవీఎస్ 450సీసీ బైక్ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ద్వారా భారతీయ ఇంజినీరింగ్‌ను ప్రదర్శించడం గర్వంగా ఉంది. ఇక్కడి వాహనాల తయారీ రంగంలో భారత జెండా ఎగురుతుండటం ఆనందంగా ఉంది. ఏ దేశ విజయానికైనా తయారీ రంగమే వెన్నెముకలాంటిది. ఇండియాలో తయారీ రంగం దెబ్బతింటోంది. వాస్తవానికి ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. మన ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది' అని రాహుల్(Rahul Gandhi) పేర్కొన్నారు. లేటెస్ట్ కార్లు, బైకులను నడుపుతూ.. రాహుల్ గాంధీ కాసేపు సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) తమిళనాడులోని హోసూర్ ప్లాంట్‌లో టీవీఎస్‌తో కలిసి అభివృద్ధి చేసిన బీఎండబ్ల్యూ జీ-450జీఎస్ బైక్ ను పరిశీలిస్తున్నట్లు ఆయన వీడియోలో కనిపించారు. ఈ బైక్ ఇంకా భారత్‌లో విడుదల కాలేదు. జర్మన పర్యటన సందర్భంగా, రాహుల్ గాంధీ బీఎండబ్ల్యూ కారు నడుపుతూ దాని లక్షణాలను అన్వేషిస్తూ కనిపించారు. దుబాయ్‌కు చెందిన కుటుంబంతో సహా అనేక మంది భారతీయులతో కూడా సంభాషించారు. అలానే పలువురు సందర్శకులకు సెల్ఫీ ఇచ్చారు.