Share News

Tragedy: మంటగలిసిన మానవత్వం.. హృదయవిదారక ఘటన

ABN , Publish Date - Dec 17 , 2025 | 03:55 PM

గుండెనొప్పి వచ్చిన తన భర్తను రెండు ఆస్పత్రులు తిప్పింది ఆ భార్య. రెండో ఆస్పత్రిలో టెస్ట్ చేసి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. అంబులెన్స్ లేదని చెప్పారు. బైక్ పై బయలుదేరారు. ఇంతలో యాక్సిడెంట్.. రోడ్డు మీద ఆ భార్య..

Tragedy: మంటగలిసిన మానవత్వం.. హృదయవిదారక ఘటన
Bengaluru Tragedy

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 17: బెంగళూరు నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బనశంకరి ప్రాంతంలోని బాలాజీ నగర్ నివాసి అయిన, 34 ఏళ్ల గ్యారేజ్ మెకానిక్ వెంకటరమణన్ అర్ధరాత్రి 3:30 గంటల ప్రాంతంలో తీవ్ర ఛాతీ నొప్పితో బాధపడ్డారు. గతంలో ఆయనకు ఒకసారి స్వల్ప గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన భార్య రూపా వెంటనే ఆయన్ను బైక్‌పై ఆసుపత్రికి తరలించింది.


మొదటి ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేరని, రెండో ఆసుపత్రిలో ఈసీజీ చేసి మైల్డ్ హార్ట్ అటాక్ అని చెప్పి.. జయదేవ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో మళ్లీ బైక్‌పై బయలుదేరిన దంపతులు దారిలో ప్రమాదానికి గురయ్యారు. వెంకటరమణన్ రోడ్డుపై పడిపోయి నొప్పితో కొట్టుమిట్టాడాడు.

రక్తంతో నిండిన రూపా చేతులు జోడించి వెళ్లే వాహనాలను ఆపి సాయం కోరింది. సీసీటీవీ దృశ్యాల్లో ఆమె ఆర్తనాదాలు రికార్డయ్యాయి. కానీ చాలాసేపు ఎవరూ ఆగలేదు. అనంతరం ఓ క్యాబ్ డ్రైవర్ ఆగి ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే వెంకటరమణన్ మరణించాడు.


'నా భర్తకు ఎవరూ సాయం చేయలేదు. రక్తంతో నిండి చేతులు జోడించి వేడుకున్నా ఎవరూ రాలేదు' అని రూపా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఇంతటి దుఃఖంలోనూ కుటుంబం ఆయన కళ్లు దానం చేసి మరొకరికి చూపు ఇచ్చింది.

వెంకటరమణన్‌కు ఐదేళ్ల కుమారుడు, 18 నెలల కూతురు ఉన్నారు. ఈ ఘటన ఆసుపత్రుల నిర్లక్ష్యం, అంబులెన్స్‌ల లేమి, ఆపదలో ఉన్నవారి పట్ల ప్రజల ఉదాసీనతను ఎత్తి చూపింది.


Also Read:

శీతాకాలంలో పచ్చి బఠానీలు తినొచ్చా?

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 17 , 2025 | 04:44 PM