Rahul Gandhi: ప్రధాని మోదీకి పేద ప్రజల కంటే ‘వారే’ ముఖ్యం
ABN , Publish Date - Jan 27 , 2025 | 03:26 PM
Rahul Gandhi: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను విమర్శిస్తున్న బీజేపీపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. రాజ్యాంగం లేకుంటే దేశంలో ఎవరు మిగలరని ఆయన పేర్కొన్నారు.
భోపాల్, జనవరి 27: ప్రధాని నరేంద్ర మోదీకి పేద ప్రజల కంటే బడా బాబులే ముఖ్యమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానీ, అంబానీ లాంటి వాళ్లకు దేశ సంపదను దోచి పెడుతోన్నారంటూ ప్రధాని మోదీపై ఆయన మండిపడ్డారు. రాజ్యాంగం లేకుంటే దేశంలో ఎవరు మిగలరని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను మోదీ ప్రభుత్వం అవమానిస్తోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మోవ్ వేదికగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
ఈ సందర్భంగా మోదీ పాలనలో అంబేద్కర్‌కు జరుగుతోన్న అవమానాన్ని ఆయన వివరించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతోపాటు వయనాడ్ ఎంపీ ప్రియాంక వాద్రా తదితర అగ్రనేతలు హాజరయ్యారు. అలాగే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం ఈ ర్యాలీకి విచ్చేశారు.
దాదాపు 2 లక్షల మంది పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ర్యాలీ గురించి మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు జీతు పట్వారీ మాట్లాడుతూ.. ప్రజల హక్కులు.. మరి ముఖ్యంగా 'భావ ప్రకటనా స్వేచ్ఛ'ను కాపాడటంతోపాటు రాజ్యాంగాన్ని రక్షించడమే లక్ష్యంగా చేసుకొని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని నిరంతరం ఆయన ప్రజల మధ్యకు తీసుకు వెళ్తారన్నారు.
మరోవైపు స్వాతంత్య్ర సమరయోధులను అవమానించడం.. రాజ్యాంగాన్ని బలహీన పరుస్తోందంటూ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. అలాగే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను సైతం బీజేపీ నేతలు అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజల మధ్యకు బలంగా తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ క్రమంలో గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించి.. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా చొచ్చుకు వెళ్లేలా ఆ పార్టీ అడుగులు వేస్తోంది.
ఇంకోవైపు నిన్న అంటే.. జనవరి 26వ తేదీ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. బీఆర్ అంబేద్కర్ జన్మించిన మోవ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు.
కొంత మందికి బీఆర్ అంబేద్కర్ జన్మస్థలం మోవ్ పర్యాటక ప్రాంతమైందంటూ ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇక మోవ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించే ర్యాలీలో రాజకీయ ప్రసంగాలపై స్థానిక జిల్లా యంత్రాంగం ఆంక్షలు విధించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతోన్నాయి. ఇది అప్రజాస్వామికమని ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు.
For National News And Telugu News