Share News

Rahul Gandhi : అర్ధరాత్రి సీఈసీ నియామకం సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘనే!

ABN , Publish Date - Feb 19 , 2025 | 04:46 AM

కొత్త ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్‌కుమార్‌ను నియమించాలని అర్ధరాత్రి నిర్ణయించడం ద్వారా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అగౌరవంగా, అమర్యాదకరంగా వ్యవహరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సుప్రీంకోర్టు

 Rahul Gandhi : అర్ధరాత్రి సీఈసీ నియామకం సుప్రీం ఉత్తర్వుల ఉల్లంఘనే!

ఎంపిక ప్రక్రియపై సుప్రీంలో విచారణ ఉండగా ఇలా చేస్తారా: రాహుల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): కొత్త ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్‌కుమార్‌ను నియమించాలని అర్ధరాత్రి నిర్ణయించడం ద్వారా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అగౌరవంగా, అమర్యాదకరంగా వ్యవహరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని అన్నారు. అసలీ ఎంపిక ప్రక్రియనే సవాల్‌ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరుగనుండగా.. సోమవారం రాత్రి పొద్దుపోయాక హడావుడిగా నిర్ణయం తీసుకోవడం ఏమిటని మంగళవారం ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు. సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని ప్రధాని, విపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ చేపట్టాలని ఆదేశిస్తూ 2023 మార్చి 2న రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. ‘దురదృష్టవశాత్తూ.. ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించి.. ఆ స్థానంలో ప్రధాని నియమించే కేబినెట్‌ మంత్రిని చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో చట్టం తెచ్చింది. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను దారుణంగా ఉల్లంఘించడమే. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా కొత్త సీఈసీ ఎంపికను వాయిదా వేయాలన్నది కాంగ్రెస్‌ పార్టీ నిశ్చిత వైఖరి. కమిటీ సమావేశంలో ప్రధానికి, హోం మంత్రికి నా అసమ్మతి తెలియజేశాను. ఓ పక్క ఎంపిక కమిటీ కూర్పునే సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినప్పుడు.. మరో 48 గంటల్లో కోర్టు ముందు విచారణకు రానున్నప్పుడు అర్ధరాత్రి కొత్త సీఈసీని ఎంపిక చేశారు’ అని రాహుల్‌ ఆక్షేపించారు. ప్రజాస్వామ్యం, ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో కార్యనిర్వాహక విభాగం జోక్యం చేసుకోరాదని హెచ్చరిస్తూ 1949 జూన్‌లో రాజ్యాంగ సభలో అంబేడ్కర్‌ చేసిన ప్రసంగాన్ని రాహుల్‌ ప్రస్తావించారు. అయితే, సుప్రీం కోర్టు తీర్పునకు రాహుల్‌ వక్రభాష్యం చెబుతున్నారని ఆ పార్టీ ఐటీ విభాగం ఇన్‌చార్జి మాలవీయ విమర్శించారు. సుప్రీం తీర్పునకు ముందు సీఈసీ, కమిషనర్లను ప్రధాని సిఫారసు మేరకే రాష్ట్రపతి నియమించేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో ఎన్నికల కమిషనర్లను ఎలా నియమించారో రాహుల్‌ మరచిపోయారా అని ‘ఎక్స్‌’లో నిలదీశారు.


నేడు సుప్రీంకోర్టులో విచారణ

సీఈసీ, ఎన్నికల కమిషనర్లను 2023నాటి చట్టం ప్రకారం నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రాధాన్య ప్రాతిపదికన బుధవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఉల్లంఘించి.. ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పిస్తూ తీసుకొచ్చిన చట్టం కింద కేంద్రం సోమవారం సీఈసీ, ఎన్నికల కమిషనర్‌ను నియమించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ మంగళవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

370 రద్దు వెనుక జ్ఞానేశ్‌కుమార్‌

నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్‌(సీఈసీ)గా నియమితులైన జ్ఞానేశ్‌కుమార్‌.. మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్లో, వాటి అమల్లో కీలక భూమిక పోషించారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు, ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీరు, లద్ధాఖ్‌ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ తీసుకొచ్చిన చట్టాలకు రూపకల్పన చేసింది ఆయనే. అంతేకాదు.. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాటులోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 2018-21 నడుమ కేంద్ర హోం శాఖలో ఆయన అదనపు కార్యదర్శిగా పనిచేశారు. 2019లో 370 అధికరణ రద్దు, జమ్మూకశ్మీరు పునర్విభజన జరిగాయి. ఆ పునర్విభజన బిల్లును తయారుచేసే బాధ్యతను మోదీ ప్రభుత్వం జ్ఞానేశ్‌కుమార్‌కు అప్పగించింది. ప్రభుత్వం అతి రహస్యంగా తీసుకొచ్చిన బిల్లుల్లో ఇదొకటి. ఈయన కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. గతేడాది జనవరి 31న పదవీవిరమణ చేశారు. అదే మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు సీఈసీగా 2029 జనవరి 26 వరకు బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా, ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు.


ఇవి కూడా చదవండి:

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..


Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 19 , 2025 | 04:46 AM