Share News

Rahul Gandhi: పాక్‌తో పోరాడే సంకల్పమే మీకు లేదు

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:18 AM

పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు మనదేశం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన తీరును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఆక్షేపించారు.

Rahul Gandhi: పాక్‌తో పోరాడే సంకల్పమే మీకు లేదు

  • బలగాల చేతులు కట్టేసి ఆపరేషన్‌ సిందూర్‌లోకి దించారు

  • 1971 యుద్ధంతో పోలికా?

  • అమెరికా ఒత్తిడి తెచ్చినా ఇందిర డోంట్‌ కేర్‌ అన్నారు: రాహుల్‌

  • బలగాల చేతులు కట్టేసి ఆపరేషన్‌ సిందూర్‌లోకి దించారు

  • అందుకే కొన్ని విమానాలను మనం కోల్పోవాల్సి వచ్చింది: రాహుల్‌

న్యూఢిల్లీ, జూలై 29: పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు మనదేశం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన తీరును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఆక్షేపించారు. పాకిస్థాన్‌తో పోరాటం చేసేందుకు ప్రభుత్వానికి రాజకీయ సంకల్ప బలమే లేకుండాపోయిందని విమర్శించారు. సాయుధ బలగాల చేతులను కట్టేసి, పాక్‌పై దాడికి దిగాలని ఆదేశించారని దుయ్యబట్టారు. భారత్‌-పాక్‌ మధ్య సంఘర్షణను నివారించానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ ఆయన చెబుతోంది అబద్ధం అని ప్రధాని మోదీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని రాహుల్‌ ప్రశ్నించారు. మంగళవారం లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై జరిగిన చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడారు. పెహల్గాం ఘటనలో మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. దాడికి ప్రతీకారంగా బలగాలు, ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ఇండీ కూటమి ఒక్కతాటిపై నిలిచి మద్దతు పలికిందని గుర్తు చేశారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను, 1971 నాటి యుద్ధంతో పోల్చడాన్ని రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. 1971లో జరిగిన యుద్ధంలో రాజకీయ సంకల్పం ఉందన్నారు. మనదేశంపై అమెరికా ఒత్తిడి చేసినా, తన నౌకాదళాన్ని హిందూ మహాసముద్రంలో మోహరించినా నాటి ప్రధాని ఇందిరా గాంధీ వెనక్కు తగ్గలేదన్నారు. అమెరికా.. విమాన వాహక నౌకతో వస్తున్నా ఇందిర డోంట్‌ కేర్‌ అన్నారని.. ‘బంగ్లాదేశ్‌లో మేం ఏం చేయాలనుకున్నామో అది చేసితీరుతాం’ అని అమెరికాకు ఆమె స్పష్టం చేశారని చెప్పారు. ఆమె ఆలోచనలో గందరగోళం లేదని.. దీన్నే ‘రాజకీయ సంకల్ప బలం’ అంటారని రాహుల్‌ నొక్కి చెప్పారు. పాక్‌తో యుద్ధం చేసేందుకు రాజకీయ సంకల్ప బలం లేదన్న విషయాన్ని ఒకరకంగా రక్షణమంత్రి రాజ్‌నాథే పాక్‌కు చెప్పారని రాహుల్‌ ఆరోపించారు. అర్ధరాత్రి 1:35 గంటలకు పాక్‌కు ఫోన్‌ చేసి.. సైనికేతర లక్ష్యాలపైనే దాడి చేశామని.. ఉద్రిక్తతలను పెంచడం తమ లక్ష్యం కాదని చెప్పినట్లుగా స్వయంగా రాజ్‌నాథే వెల్లడించడం దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. మిలటరీ లక్ష్యాలను టార్గెట్‌ చేసుకోరంటే.. దానర్థం, పోరాటానికి రాజకీయ సంకల్పం లేనట్లేనన్నారు. ఇది.. ‘మేం మీకు లెంపకాయ వేశాం. మరిన్ని లెంపకాయలు వేయబోం’ అన్నట్లుగానే ఉందన్నారు. పాక్‌ మిలటరీ ఇన్‌ఫ్రాస్టక్చర్‌, వాయుసేన స్థావరాలపై దాడి చేయకూడదనే నిర్దేశించడంతోనే భారత్‌ కొన్ని ఎయిర్‌క్రా్‌ప్టలను కోల్పోవాల్సి వచ్చిందని ఇండోనేషియాలోని భారత రక్షణ అధికారి కెప్టెన్‌ శివ కుమార్‌ చెప్పారని రాహుల్‌ పేర్కొంటూ.. ఇది బలగాల చేతులు కట్టేయడం కాకపోతే మరేమిటి? అని ప్రశ్నించారు. కాగా పెహల్గాం ఘటనలో భద్రతా వైఫల్యానికి హోం మంత్రి అమిత్‌ షా బాధ్యత వహించాలని రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు.


అమిత్‌ షా.. సమాధానం చెప్పండి: ప్రియాంక

శత్రుదేశమైన పాకిస్థాన్‌కు దారులన్నీ మూసుకుపోయి.. దిక్కుతోచని పరిస్థితిలో పడ్డప్పుడు మనదేశం అకస్మాత్తుగా యుద్ధాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది? అని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. అర్ధంతరంగా యుద్ధాన్ని ఆపడం దేశచరిత్రలోనే మొదటిసారి అని.. పైగా పాక్‌తో మనదేశం యుద్ధాన్ని ఆపుతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేశారని ఆమె గుర్తుచేస్తూ.. ఇది ప్రధాని మోదీ బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. నాయకత్వం అంటే క్రెడిట్‌ తీసుకోవడం మాత్రమే కాదని, బాధ్యత తీసుకోవడం కూడా అని మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన కేంద్ర ప్రభుత్వం, ఇంటెలిజెన్స్‌ అదిపెద్ద వైఫల్యం అని దునుమాడారు. ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు? హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేశారా? బాధ్యత తీసుకుంటున్నట్లుగానైనా ప్రకటించారా? అని ప్రశ్నించారు. ఆపరేషన్‌ సింధూర్‌తో కాళ్లబేరానికి రావడం మినహా పాక్‌కు మరో అవకాశం లేకపోయిందని షా చెబుతున్నారని.. అయితే శత్రుదేశానికి ఆ అవకాశం ఎందుకిచ్చారు? అని ఆమె నిలదీశారు.

Updated Date - Jul 30 , 2025 | 05:18 AM