DK Shivakumar: రాహుల్ గాంధీనే మా నేత, ఆయనను పీఎం చేయడమే ప్రియాంక లక్ష్యం.. డీకే వివరణ
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:50 PM
కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగనుందనే ఊహాగాలను డీకే మరోసారి కొట్టివేశారు. ఏఐసీసీ అగ్రనేతలను ఎవరినీ తాను కలవలేదని, ఉప ముఖ్యమంత్రి పదవిలో తాను హ్యాపీగా ఉన్నానని, పార్టీ కార్యకర్తగా ఉండేందుకే తాను ఇష్టపడతానని చెప్పారు.
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయన్నాంటూ జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తోసిపుచ్చారు. ఇవన్నీ ఊహాగానాలేనని అన్నారు. రాహుల్ గాంధీనే తమకు, తన పార్టీ కార్యకర్తలకు నాయకుడని చెప్పారు. ప్రధానమంత్రి కావాలనే కోరిక ప్రియాంకగాంధీకి కూడా లేదని, రాహుల్‌ను దేశ ప్రధానిని చేసేందుకు ఆమె కట్టుబడి ఉన్నారని తెలిపారు.
'జరుగుతున్న పరిణామాల గురించి నాకు తెలియదు. మా నేత ఏఐసీసీ అధ్యక్షుడు. మా నాయకుడు విపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ ఏకైక లక్ష్యం దేశ ప్రధానిగా రాహుల్‌గాంధీని చూడటం' అని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ డీకే చెప్పారు.
ప్రియాంక గాంధీని అత్యున్నత పదవిలో చూడాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఆమె భర్త రాబర్డ్ వాద్రా ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం సంచలనమైంది. ప్రియాంక తన నాయకత్వ పటిమను ఇప్పటికే నిరూపించుకున్నారని, ప్రజలు ఆమెలో ఇందిరాగాంధీని చూస్తున్నారని వాద్రా అన్నారు. తనను సైతం రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని, ప్రస్తుతానికైతే ప్రజా సమస్యలపైనే తాము దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ, ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకను ముందుకు తేవాలన్నారు.
కర్ణాటకలో సీఎం మార్పుపై..
కాగా, కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగనుందనే ఊహాగాలను డీకే మరోసారి కొట్టివేశారు. ఏఐసీసీ అగ్రనేతలను ఎవరినీ తాను కలవలేదని, ఉప ముఖ్యమంత్రి పదవిలో తాను హ్యాపీగా ఉన్నానని, పార్టీ కార్యకర్తగా ఉండేందుకే తాను ఇష్టపడతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. కర్ణాటకలో మంత్రివర్గం పునర్వవస్థీకరణపై అడిగినప్పుడు ఆ విషయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే చెప్పాలని సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి..
రూ.12,015 కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
2 రోజుల్లోనే అలర్జీ వచ్చింది.. ఢిల్లీ వాయి కాలుష్యంపై నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి