Jammu and Kashmir: చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి
ABN , Publish Date - Sep 27 , 2025 | 06:59 PM
బాందిపొరా, కుప్వారా సెక్టార్లలోని ఎల్ఓసీ మీదుగా ఉన్న ల్యాంచ్ ప్యాడ్‌లలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్టు గుర్తించామని బీఎస్ఎఫ్ ఐజీ తెలిపారు. వారు సమయం కోసం వేచిచూస్తున్నారని, అయితే ఆర్మీ, బీఎస్ఎఫ్ అధునాతన నిఘా సాధనాలతో అప్రమత్తంగా ఉందని చెప్పారు.
న్యూఢిల్లీ: కశ్మీర్ (Kashmir) లోయలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు (Terrorists) నియంత్రణ రేఖ వెంబడి లాంఛ్ ప్యాడ్ల వద్ద (LoC Launch pads) కాపు కాస్తున్నాయని బీఎస్ఎఫ్ (BSF) కశ్మీర్ ఫ్రాంటియర్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం ఉన్నట్టు చెప్పారు. అయితే ఉగ్రమూకల ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
'శీతాకాలం రావడానికి ముందు చొరబాటుదారులు కశ్మీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. నవంబర్ వరకూ ఈ రెండు నెలల్లో చొరబాట్లకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ తర్వాత ఆరు నెలలు చొరబాట్లకు అంతగా అవకాశం ఉండదని ఉగ్రమూకలకు బాగా తెలుసు. వారి యత్నాలను భగ్నం చేసేందుకు భద్రతా బలగాల అప్రమత్తంగా ఉన్నాయి' అని బీఎస్ఎఫ్ ఐజీ తెలిపారు.
బాందిపొరా, కుప్వారా సెక్టార్లలోని ఎల్ఓసీ మీదుగా ఉన్న ల్యాంచ్ ప్యాడ్‌లలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. వారు సమయం కోసం వేచిచూస్తున్నారని, అయితే ఆర్మీ, బీఎస్ఎఫ్ అధునాతన నిఘా సాధనాలతో ఎల్ఓసీ వెంబడి గట్టి పట్టుతో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది ఇంతవరకూ రెండు చొరబాటు యత్నాలను భద్రతా బలగాలు విఫలం చేశాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
'ఐ లవ్ మహమ్మద్' నిరసనలు హింసాత్మకం.. తౌకీర్ రజా ఖాన్ అరెస్టు
వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు.. లద్దాఖ్ హింసపై డీజీపీ ప్రకటన
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి