Bihar Elections: ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 15 , 2025 | 10:37 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రశాంత్ కిశోర్ ప్రకటన చేశారు. అయితే జన్ సురాజ్ పార్టీ తరపున పోటీ చేయబోయే అందరు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటన చేశారు. అయితే జన్ సురాజ్ పార్టీ తరపున పోటీ చేయబోయే అందరు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల కౌంటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. బిహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. పార్టీ పిలుపు మేరకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించామని వివరించారు పార్టీ ప్రయోజనాల మేరకే తాను పోటీకి దూరంగా ఉంటున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ దాదాపు 150 సీట్లలో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జన సురాజ్ పార్టీ ఏ కూటమికి మద్దతిస్తుందన్న ప్రశ్నకు.. పీకే బదులిస్తూ ‘అది అసాధ్యం’ అని చెప్పుకొచ్చారు.
జన సురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే మాఫియాపై ఉక్కుపాదం మోపుతామమన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెల రోజుల్లోనే 100 మంది అవినీతి రాజకీయ నేతలు, అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌పై ప్రశాంత్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జేడీయూకు కనీసం 25 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని చెప్పారు. ఎన్డీయేకు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. నీతీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని.. అటు ఇండియా కూటమి పరిస్థితి కూడా అంతగా మెరుగ్గా లేదని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
Minister Ponnam Prabhakar: బీఆర్ఎస్, బీజేపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం..