Share News

PoK Protests Continue: పీఓకేలో రెండో రోజూ కొనసాగిన నిరసనలు

ABN , Publish Date - Sep 30 , 2025 | 06:58 PM

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రెండో రోజూ నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ ప్రభుత్వ బెదిరింపులను లెక్క చేయకుండా నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. ప్రాథమిక హక్కులను సాధించుకునే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు

PoK Protests Continue: పీఓకేలో రెండో రోజూ కొనసాగిన నిరసనలు
PoK protests 2025

ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రెండో రోజూ ప్రజానిరసనలు కొనసాగాయి. పాక్ ప్రభుత్వ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా జనాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వంతెనపై నుంచి జనాలు వెళ్లకుండా అడ్డంగా పెట్టిన కంటెయినర్‌లను నదిలోకి తోసి మరీ ముందుకు సాగారు. అవామీ యాక్షన్ కమిటీ (ఏసీసీ) సారథ్యంలో ఈ నిరసనలు మొదలైన విషయం తెలిసిందే. పాక్ పాలకుల వైఖరి కారణంగా తమకు ప్రాథమిక హక్కులు కూడా దక్కట్లేదని ఏసీసీ ప్రతినిధులు, జనాలు మండిపడుతున్నారు. తొలి రోజు ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించగా డజనుకు పైగా జనాలు గాయపడ్డారు. ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదని పాక్ ఆర్మీ, పోలీసులు గట్టి హెచ్చరికలు చేశారు (Pok Protest Continue).

వీటిని లెక్క చేయకుండా స్థానికులు రెండో రోజు కూడా నిరసనలకు దిగారు. స్థానికంగా ఉన్న మార్కెట్‌లు, షాపులు, ఇతర వ్యాపారాలను మూసేశారు. రవాణా సౌకర్యాలు కూడా స్తంభించిపోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ముందు నిరసనకారులు మొత్తం 38 డిమాండ్‌లను పెట్టారు. కశ్మీర్ నుంచి వలసొచ్చిన వారికి పీఓకే అసెంబ్లీ సీట్లలో కొన్ని కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి కోటా ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకు విఘాతమని అన్నారు (Kashmir civilian unrest).


‘మా నిరసనలు ప్రాథమిక హక్కులను సాధించుకునేందుకే. 70 ఏళ్లుగా మేము వీటి కోసం పోరాడుతున్నాము. మాకు స్వేచ్ఛ ఇవ్వకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని పాక్ ప్రధాని షహబాస్ షరీఫ్, ఇతర కీలక నేతలను ఏసీసీ నేత షౌకత్ నవాజ్ మీర్ హెచ్చరించారు.

మరోవైపు.. నిరసనలను అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది. ఇప్పటికే అక్కడ సాయుధ దళాలను మోహరించిన ప్రభుత్వం.. తాజా మరో 100 మందితో కూడిన దళాలను పంపించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ నిరసనల హోరు విదేశాలకు కూడా పాకింది. కశ్మీరీ సంతతి వారు బ్రిటన్‌లోని పాక్ రాయబార కార్యాలయాలు ఎదుట నిరసనకు తెర తీశారు.


ఇవి కూడా చదవండి:

వివాదం రేపిన పీఎం సలహాదారు వ్యాఖ్యలు.. తప్పుపట్టిన సుప్రీం బార్ అసోసియేషన్

బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2025 | 07:06 PM