Sanjeev Sanyal: వివాదం రేపిన పీఎం సలహాదారు వ్యాఖ్యలు.. తప్పుపట్టిన సుప్రీం బార్ అసోసియేషన్
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:49 PM
అసోసియేషన్ ఆఫ్ ఇండియాస్ న్యాయ నిర్మాణ్ 2025 జనరల్ కౌన్సిల్ సమావేశంలో సన్యాల్ మాట్లాడుతూ ఉన్నత న్యాయస్థానాలకు సుదీర్ఘ సెలవులపై విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ (Judiciary)పై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ (Sanjeev Sanyal) చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదం రేపాయి. వికసిత్ భారత్ కలల సాకారానికి న్యాయవ్యవస్థ 'ఒక పెద్ద అవరోధం'గా ఉందని సన్యాల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ (SCBA) అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ (Vikas Singh) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అసోసియేషన్ ఆఫ్ ఇండియాస్ న్యాయ నిర్మాణ్ 2025 జనరల్ కౌన్సిల్ సమావేశంలో సన్యాల్ మాట్లాడుతూ ఉన్నత న్యాయస్థానాలకు సుదీర్ఘ సెలవులపై విమర్శలు గుప్పించారు. దేశ లీగల్ ఫౌండేషన్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఏర్పాటయిన ఈ ఫోరంలో పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. న్యాయ పరిభాషలో వాడుతున్న 'ప్రేయర్', 'మి లార్డ్' అనే పదాలపై కూడా సన్యాల్ విమర్శించారు. ఇదొక వారసత్వంగా, ఎన్నో ఏళ్ల క్రితం నాటి హ్యాబిట్‌గా మారిందన్నారు.
బాధ్యత లేని వ్యాఖ్యలు
కాగా, న్యాయవ్యవస్థపై సన్యాల్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం బాధ్యాతాయుతంగా లేవని, ఆయన 'బ్యాడ్ టేస్ట్'కు అద్దం పడుతున్నాయని వికాస్ సింగ్ అన్నారు. ఉన్నత కోర్టుల సెలవులపై ఎవరు మాట్లాడినా వారికి ఉన్నత న్యాయస్థానాల పనితీరుపై ఏమాత్రం అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు. హైయర్ కోర్టులలో వెకేషన్ల ఉద్దేశం అర్ధం చేసుకోవాలంటే ఒక బిజీ లాయర్ లేదా జడ్జి సాధారణ సమయాల్లో ఏం చేస్తారో తెలుసుకుంటే అవగతమవుతుందని అన్నారు. న్యాయవ్యవస్థ పనితీరుపై ఎవరైనా మాట్లాడితే అది అసహనంతో చేస్తున్న వాఖ్యలుగానే భావించాల్సి ఉంటుందని చెప్పారు.
ఉన్నత న్యాయస్థానాలకు సెలవులపై సన్యాల్ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా ఆయన ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో సుదీర్ఘ సెలవులపై తక్షణ సంస్కరణలకు ఆయన పిలుపునిచ్చారు. మాజీ సీజేఐ చంద్రచూడ్ తన హయాంలో వెకేషన్ల పేరును పాక్షిక పని దినాలుగా మార్చారు.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ
26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి