PM Modi Records: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ బర్త్ డే.. ఆయన రికార్డుల గురించి తెలుసా
ABN , Publish Date - Sep 17 , 2025 | 08:19 AM
నేడు సెప్టెంబర్ 17, 2025న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. సాధారణ వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన దేశ అత్యున్నత పదవిని చేపట్టి ఎన్నో రికార్డులు సృష్టించారు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈరోజు సెప్టెంబర్ 17, 2025న తన 75వ జన్మదినాన్ని (Modi 75th Birthday) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఆయన అభిమానులు వివిధ కార్యక్రమాలతో ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో సామాన్య కుటుంబంలో జన్మించిన మోదీ, తన అసాధారణ నాయకత్వంతో దేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగారు.
2014 మే 26న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారు. అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో బీజేపీ 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించింది. ఇది ఆయన జనాదరణ, నాయకత్వ పటిమను స్పష్టం చేస్తుందని చెప్పవచ్చు.
చరిత్ర సృష్టించిన మోదీ
నరేంద్ర మోదీ తన పదవీ కాలంలో అనేక రికార్డులను సృష్టించారు. ఆయన సాధించిన కొన్ని ముఖ్యమైన విజయాల గురించి ఇక్కడ చూద్దాం.
అత్యధిక కాలం కాంగ్రెసేతర ప్రధానమంత్రి
2020 ఆగస్టు 13 నాటికి నరేంద్ర మోదీ 2,269 రోజులు పదవిలో ఉండి, అటల్ బిహారీ వాజ్‌పేయి (2,268 రోజుల) రికార్డును అధిగమించారు. దీంతో అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. 2014 నుంచి ఆయన అధికారంలో ఉన్నారు.
స్వాతంత్రం తర్వాత జన్మించిన మొదటి ప్రధాని
1947లో భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత జన్మించిన మొదటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఆయనకు ముందు పదవీ బాధ్యతలు చేపట్టిన నాయకులందరూ బ్రిటీష్ పాలనకు ముందు జన్మించినవారే కావడం విశేషం.
ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్
2025 జులై 24 నాటికి ప్రధాని మోదీ 4,078 రోజులు నిరంతరంగా పదవిలో ఉండి, ఇందిరా గాంధీ (4,077 రోజులు) రికార్డును బ్రేక్ చేశారు. దీంతో ఆయన, జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఒకే విడతలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు.
మూడు వరుస లోక్‌సభ ఎన్నికల్లో విజయం
మోదీ 2014, 2019, 2024లో మూడు వరుస లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఈ విజయం ఆయనను జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలతో సమానంగా నిలిపింది.
అత్యధిక అంతర్జాతీయ అవార్డులు
ప్రధానమంత్రి మోదీ అంతర్జాతీయంగా అత్యధిక గౌరవాలు పొందిన భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 18 దేశాలు ఆయనకు తమ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశాయి. ఇది ఆయనకు ముందు ఏ ప్రధానమంత్రికి కూడా దక్కలేదు.
ఇందిరా గాంధీ తర్వాత
ఇందిరా గాంధీ తర్వాత, లోక్‌సభలో పూర్తి మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. 1971లో ఇందిరా గాంధీ ఆధిక్యంతో తిరిగి ఎన్నికయ్యారు. అదేవిధంగా, మోదీ 2014లో బీజేపీ 282 సీట్లతో గెలువగా, 2019లో 303 సీట్లతో మరింత బలమైన ఆధిక్యంతో తిరిగి ఎన్నికయ్యారు.
మోదీ జన్మదిన వేడుకలు
మోదీ 75వ జన్మదినం సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సామాజిక సేవా, రక్తదాన శిబిరాలు వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అనేక సంస్కరణలు, ఆర్థిక వృద్ధితో అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ఆయన సామాన్య జీవనం, అసాధారణ నాయకత్వ ప్రయాణం యువతకు స్ఫూర్తినిస్తోందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి