Narendra Modi: మేడిన్ ఇండియా వస్తువులు ఉపయోగించాలి..వారి అభివృద్ధికి పాటు పడాలి
ABN , Publish Date - May 26 , 2025 | 02:00 PM
మన దేశంలో ప్రజల కొనుగోలు విధానంలో మార్పు రావాలని ప్రధాని మోదీ (narendra modi) తెలిపారు. ఈ క్రమంలో మన దగ్గర తయారైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న సమయంలో, మనం కూడా ఇక్కడే తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
దేశంలో దీపావళి, గణపతి సహా పండగ ఏదైనా సరే భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్ దాహోద్‌లో లోకోమోటివ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రజలు ఆదాయం సంపాదించి ముందుకు సాగాలంటే, ప్రతి భారతీయుడూ ఇక్కడి వస్తువులే వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. మన దేశంలో తయారైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న వేళ, మనం దేశీయ ఉత్పత్తులను ఎందుకు ఉపయోగించకూడదని ప్రశ్నించారు. రైల్వేలతో సహా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.
మోదీని ఎదుర్కొవడం
ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ గురించి కూడా ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక చర్య కాదని, ఇది మన భారతీయ విలువలు, భావాల వ్యక్తీకరణ అని మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్న వారు మోదీని ఎదుర్కొవడం ఎంత కష్టమో కలలో కూడా ఊహించలేరని మోదీ చెప్పారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా గిరిజన గ్రామాల అభివృద్ధికి సాధికారత కల్పించడానికి అనేక కొత్త పథకాలను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. గిరిజన నేత బిర్సా ముండా గౌరవార్థం గిరిజన గ్రామ ఉదయ్ అభియాన్'ను ప్రారంభించినట్లు తెలిపారు.
రైల్వే రంగానికి కొత్త శక్తి
దాహోద్ లో ప్రారంభించిన ప్లాంట్‌లో 9,000 హార్స్‌పవర్ (HP) విద్యుత్ లోకోమోటివ్స్ తయారు చేయబడతాయి. ఇవి 4,500 టన్నుల బరువును 120 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్లాంట్‌లో తయారు చేయబడిన లోకోమోటివ్స్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనవి కానున్నాయి. అలాగే, ఈ లోకోమోటివ్స్‌ను విదేశాలకు ఎగుమతి చేసే లక్ష్యంతో తయారు చేయనున్నారు. తద్వారా ఇది "మేక్ ఫర్ వరల్డ్" కార్యక్రమానికి తోడ్పాటునివ్వనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా తదితరులు పాల్గొన్నారు.
10 వేల ఉద్యోగాలు..
ఈ లోకోమోటివ్స్ రెజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. ఇవి శక్తి వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే, డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ (కవచ్) వంటి ఆధునిక సాంకేతికతలు ఈ లోకోమోటివ్స్‌లో అమర్చబడ్డాయి. ఇవి రైల్వే భద్రతను మరింత పెంచుతాయి. ఈ ప్లాంట్ ప్రారంభంతో దాహోద్ ప్రాంతంలో దాదాపు 10,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. అందులో 3,500 ప్రత్యక్ష, 7,000 పరోక్ష ఉద్యోగాలు ఉంటాయి. ఈ ప్లాంట్ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు యువతకు ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది.
ఇవీ చదవండి:
నేడు పంజాబ్ vs ముంబై మధ్య కీలక మ్యాచ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి