Share News

PM Modi: సీజేఐపై దాడి యత్నంతో ప్రతి ఒక్క భారతీయుడు ఆగ్రహంతో ఉన్నారు..

ABN , Publish Date - Oct 06 , 2025 | 09:41 PM

సుప్రీంకోర్టులో ఒక కేసుపై విచారణ జరుగుతుండగా రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సీజేఐపై బూటు విసిరేందుకు ప్రయత్నించారు. అయితే అది బెంచ్ వరకూ వెళ్లలేదు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా కలవరపాటుకు గురయ్యారు.

PM Modi: సీజేఐపై దాడి యత్నంతో ప్రతి ఒక్క భారతీయుడు ఆగ్రహంతో ఉన్నారు..
PM Modi with CJI Justice BR Gavai

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai)పై ఒక న్యాయవాది దాడికి ప్రయత్నించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రంగా ఖండించారు. ఈ చర్య దేశవాసులందరికీ ఆగ్రహం కలిగించిందని అన్నారు. దాడి ఘటనపై సీజేఐకి ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ఈ విషయాన్ని ఒక ట్వీట్‌లో మోదీ తెలియజేశారు.


'సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌తో మాట్లాడాను. సుప్రీంకోర్టులో ఇవాళ ఉదయం ఆయనపై జరిగిన దాడి దేశ పౌరులందరికీ ఆగ్రహం కలిగించింది. ఇలాంటి బాధ్యతారాహిత్య చర్యలకు మన సమాజంలో చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించాల్సిన చర్య' అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తనపై దాడికి ప్రయత్నం జరిగినా నిబ్బరంగా వ్యవహరించిన సీజేఐని ప్రధాని అభినందించారు. న్యాయం పట్ల సీజేఐకు ఉన్న నిబద్ధత ప్రశంసనీయమని, రాజ్యంగ స్ఫూర్తి మరింత పటిష్టమైందని అన్నారు.


సుప్రీంకోర్టులో ఒక కేసుపై విచారణ జరుగుతుండగా రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సీజేఐపై బూటు విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే అది బెంచ్ వరకూ వెళ్లలేదు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా కలవరపాటుకు గురయ్యారు. అతన్ని భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు. అనంతరం సీజేఐ తన విచారణను కొనసాగించారు. దాడికి పాల్పడిన లాయర్ రాకేష్ కిషోర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 06 , 2025 | 09:58 PM