Share News

PM Modi Slams Opposition: మరణించిన నా తల్లిని దూషిస్తారా

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:11 AM

ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బిహార్లో చేపట్టిన ఓటర్‌ అధికార యాత్రలో కాంగ్రెస్‌, ఆర్‌జేడీ నేతలు తన తల్లిని, తనను దూషించడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. నూరేళ్లు బతికి మరణించిన తన తల్లికి రాజకీయాలు తెలియదని..

PM Modi Slams Opposition: మరణించిన నా తల్లిని దూషిస్తారా

ఇది అందరు అమ్మలు, అక్కచెల్లెళ్లను, ఆడబిడ్డలను అవమానించడమే : ప్రధాని

  • బీసీ గద్దెనెక్కడం కాంగ్రెస్‌ సహించదు

  • ఆర్జేడీ హయాంలో బిహార్లో నేరాల వెల్లువ

  • అందుకే మహిళలే దించేశారు: మోదీ

న్యూఢిల్లీ/పట్నా, సెప్టెంబరు 2: ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బిహార్లో చేపట్టిన ‘ఓటర్‌ అధికార యాత్ర’లో కాంగ్రెస్‌, ఆర్‌జేడీ నేతలు తన తల్లిని, తనను దూషించడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. నూరేళ్లు బతికి మరణించిన తన తల్లికి రాజకీయాలు తెలియదని.. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. తన తల్లినే గాక దేశంలోని అందరు అమ్మలు, అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలను అవమానించడమేనని స్పష్టంచేశారు. స్వయం సహాయక బృందాల(ఎ్‌సజీహెచ్‌ గ్రూపులు)కు ఆర్థిక సాయం చేయడానికి సీఎం నితీశ్‌కుమార్‌ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘జీవికా నిధి సాఖ్‌ సహకారీ సంఘ్‌ లిమిటెడ్‌’ సంస్థను మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అమ్మ ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం. కొద్దిరోజుల కిందట దర్భంగాలో జరిగిన కాంగ్రె్‌స-ఆర్‌జేడీ సభ వేదికపై నా తల్లిని దూషించారు. సంప్రదాయ విలువలకు పేరుగాంచిన బిహార్‌ నేలపై ఇలాంటి ఘటన జరుగుతుందని నేనెన్నడూ ఊహించలేదు. బిహార్లో ఇది చూసిన ప్రతి తల్లీ ఇందుకు ఎంతగానో బాధపడుతోందని నాకు తెలుసు. నా గుండెల్లో ఉన్నంత బాధే వారిలో కూడా ఉంది. భారత మాతనే అవమానించేవారికి.. నా తల్లి పట్ల అలాంటి అసభ్య పదాలు వాడడం పెద్ద లెక్కలోది కాదు. ఇలాంటివారిని శిక్షించాలి. నా తల్లికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆమె తప్పేంటి..? ఎందుకు దూషించాలి? బిహార్‌ సీతామాత జన్మభూమి. కాంగ్రెస్‌, ఆర్‌జేడీలను నేను క్షమించినా.. బిహార్‌ తల్లులు క్షమించరు’ అని మోదీ అన్నారు. తనకు జన్మనిచ్చిన తల్లి మాతృభూమికి సేవచేయాలని తనను కోరిందని.. అందుకే దేశంలో మహిళల సంక్షేమానికి తాను అవిశ్రాంతంగా కృషిచేస్తున్నానని తెలిపారు. ఆమె తన కోసం చీర కూడా కొనుక్కుని ఎరుగదని చెప్పారు. మహిళా వ్యతిరేక మనస్తత్వం ఉన్నవారు అధికారంలోకి వస్తే.. అమ్మలు, అక్కచెల్లెళ్లు, ఆడబిడ్డలు ఎక్కువ బాధలు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్‌జేడీ హయాంలో రాష్ట్రంలో నేరాలు, హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, వసూళ్లు నిత్యకృత్యమని గుర్తుచేశారు. హంతకులు, రేపిస్టులకు ఆర్‌జేడీ ప్రభుత్వం రక్షణ కల్పించిందన్నారు. నాడు మహిళలే ఎక్కువగా బాఽధలు పడ్డారని.. వారే ఆ ప్రభుత్వాన్ని దించేశారని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు చెందినవారు అధికారంలోకి రావడాన్ని కాంగ్రెస్‌ ఎప్పుడూ సహించదని.. అందుకే తనను దూషిస్తోందని మోదీ ధ్వజమెత్తారు.


తక్కువ వడ్డీతో రుణాలు..

స్వయం సహాయక బృందాలకు తక్కువ వడ్డీతో రుణాలు/ఆర్థిక సాయం అందించడం నితీశ్‌ సర్కారు ప్రారంభించిన ‘జీవికా నిధి’ లక్ష్యం. ఈ సంస్థ నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం, కేంద్రం కూడా నిధులు అందిస్తాయి. మహిళా పారిశ్రామికవేత్తలు ఆర్థిక సాయం కోసం ప్రస్తుతం సూక్ష్మ ఆర్థిక సంస్థలపై ఆధారపడుతున్నారు. 18-24 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలకు తక్కువ వడ్డీలతో సకాలంలో ఆర్థిక సాయం అందించే జీవికా నిధిని ఏర్పాటుచేశారు. ఈ వ్యవస్థ పూర్తిగా డిజిటల్‌ లావాదేవీలే నడుస్తాయి. దీని ద్వారా ‘జీవికా దీదీల’ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు బదిలీ అవుతాయి.

కాంగ్రెస్‌ నేత ఖేడాకు రెండు ఓటరు ఐడీలు

కాంగ్రెస్‌ మీడియా విభాగం ఇన్‌చార్జి పవన్‌ ఖేడాకు వేర్వేరు నంబర్లతో రెండు ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. బిహార్‌లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్‌ గాంధీ గగ్గోలు పెడుతున్నారని, కానీ అసలు ‘ఓట్ల దొంగ’ కాంగ్రెస్సేనని విమర్శించింది. ఖేడాకు రెండు ఓటరు ఐడీలు ఎలా వచ్చాయో ఎన్నికల సంఘం(ఈసీ) దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల సంఘం ఖేడాకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ 11 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని సూచించింది. బీజేపీ ఆరోపణలపై ఖేడా స్పందిస్తూ ఆ పార్టీ నాయకులు చెప్పిన తర్వాతే తనకు రెండో ఓటరు ఐడీ ఉన్నట్లు తెలిసిందన్నారు. దీన్ని బట్టి ఓటర్ల జాబితాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో తేటతెల్లమవుతోందన్నారు. దీనికి ఈసీనే నిందించాలని, ఓటర్ల జాబితాలను సక్రమంగా నిర్వహించడంలో ఈసీ విఫలమైందని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 05:55 AM