Share News

PM Modi Pahalgam Attack Response: కలలో కూడా ఊహించని విధంగా శిక్ష విధిస్తాం.. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:19 PM

పహెల్గామ్‌లో దారుణానికి పాల్పడ్డ ఉగ్రవాదులకు మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ దారుణంపై తొలిసారి ఆయన స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు చేశారు.

PM Modi Pahalgam Attack Response: కలలో కూడా ఊహించని విధంగా శిక్ష విధిస్తాం.. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక
PM Modi on Pahalgam attack

జమ్మూకశ్మీర్‌లోని పహెల్గామ్‌లో అమాయక పర్యాటకులను బలితీసుకున్న ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక చేశారు. కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామని అన్నారు. బీహార్‌లోని మధుబనిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని తొలిసారిగా కశ్మీర్ ఘటనపై స్పందించారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని, భారత్‌పై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదానికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు, దాడి వెనకున్న కుట్రదారులను కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని అన్నారు. అంతకుమునుపు.. ఉగ్రవాదానికి బలైన వారికి సంతాప సూచకంగా ప్రధాని ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం.. ప్రసంగిస్తూ ఉగ్రమూకలకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.


‘‘వారు భారత్ ఆత్మపై దాడి చేసే దుస్సాహసం చేశారు. ప్రపంచానికి మేము చెప్పేది ఒక్కటే.. ఉగ్రవాదులను, వారికి సాయమందించిన వారందరినీ గుర్తించి శిక్షిస్తాము. భూమి అంచుల వరకూ వారిని వెంటాడి పట్టుకుంటాము. ఉగ్రవాదంతో భారత్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు’’ అని మోదీ నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఉగ్రవాదుల ఘాతుకాన్ని ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో యావత్ దేశం ఏకమైందని అన్నారు.


పహెల్గామ్‌లోని బైసారంలో పర్యటనకు వచ్చిన టూరిస్టులను మంగళవారం నాడు ఉగ్రవాదులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. ఈ దాడి కుట్రదారు పాక్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ పాక్‌పై పలు చర్యలకు ఉపక్రమించింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంతో పాటు దౌత్య పరమైన చర్యలకు ఉపక్రమించింది. పాక్‌లో భారత సాయుధదళాల సలహాదారులను వెనక్కు పిలిపించుకోవడంతో పాటు ఇక్కడున్న పాక్ రక్షణ శాఖ సలహాదారులను కూడా దేశం వీడాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

భారత్‌లో పాక్ ట్విట్టర్ అకౌంట్‌పై వేటు

పాక్ ఆర్మీ చీఫ్ బిన్ లాడెన్ లాంటోడు.. కశ్మీర్ దాడిపై అమెరికా అధికారి తీవ్ర ఆగ్రహం

న్యాయమూర్తులపై మహిళ సంచలన వ్యాఖ్య.. షాకిచ్చిన కోర్టు

Read Latest and National News

Updated Date - May 19 , 2025 | 11:36 PM