Pakistan Government X Account Suspended: భారత్‌లో పాక్ ట్విట్టర్ అకౌంట్‌పై వేటు
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:40 AM
పహల్గామ్ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పాక్ ప్రభుత్వ ట్విట్టర్ అకౌంట్ నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

పహల్గమ్ ఉగ్రదాడి వెనుకున్న పాక్‌కు భారత్ మరో షాకిచ్చింది. భారత్‌లో పాక్ ప్రభుత్వ ట్విట్టర్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అకౌంట్‌ను నిరవధికంగా నిలుపుదల చేసింది. అమాయకుల ప్రాణాలను బలిదీసుకున్న ఘటన వెనక సూత్రధారి అయిన పాక్‌పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన చర్యలు అవలంబించింది. సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలుపుదల చేయడంతో పాటు పాక్ దౌత్య సిబ్బందిని దేశం వీడాలని ఆదేశించింది.
పహల్గామ్ దాడి తరువాత భద్రతాంశాలను పర్యవేక్షించే కేంద్ర కేబినెట్ కమిటీ ప్రధాని మోదీ సారథ్యంలో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం పాక్‌పై కఠిన చర్యలకు తెరతీసింది. బుధవారం నాటి పత్రికా సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. పాక్‌తో దౌత్య సంబంధాలను పరిమితం చేసినట్టు ప్రకటించారు. ఇరు దేశాల దౌత్యకార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 50 నుంచి 30కి కుదిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, పాక్ హైకమిషన్‌లోని ఆర్మీ, నేపీ, వాయుసేన సలహాదారులను కూడా దేశం వీడాలని ఆదేశించినట్టు తెలిపారు. పాక్‌లోని భారత మిలిటరీ అడ్వైజర్లను కూడా వెనక్కు పిలిపిస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు, సార్క్ వీసా మినహాయింపు పథకం నుంచి కూడా పాక్ జాతీయులను భారత్ తప్పించింది. ఇప్పటికే ఈ వీసాప భారత్‌లో ఉన్న వారు దేశాన్ని వీడాలంటూ 48 గంటల గడువు విధించింది. అట్టారీ వాఘా సరిహద్దు చెక్ పోస్టును కూడా తక్షణం మూసేసింది.
ఏమిటీ సార్క్ వీసా పథకం
సార్క్ కూటమి దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ఆయా దేశాల ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేసేందుకు 1988 ఈ ప్రత్యేక వీసా పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో ఇస్లామాబాద్‌లో సమావేశమైన సార్క్ దేశాల అధినేతలు ఈ పథకానికి రూపకల్పన చేశారు. దీని ప్రకారం, భారత్, పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల వారు ఇతర సార్క్ దేశాల్లో సాధారణ వీసా వీసాలు అవసరం లేకుండానే పర్యటించవచ్చు. ఈ పథకం కింద ప్రత్యేక వీసా స్టిక్కర్లను కేటాయిస్తారు.
సార్క్ దేశాల ప్రముఖులకు మాత్రమే అందుబాటులో ఉండే పథకం, ప్రభుత్వ అధికారులు, పార్లమెంటు సభ్యులు, జడ్జీలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, క్రీడాకారులు వంటి 24 కేటగిరీల వ్యక్తులకు ఈ వీసా మంజూరు చేస్తారు. ఏడాది పాటు ఈ వీసా చెల్లుబాటు అవుతుంది. ఏటా సార్క్ దేశాల ఇమిగ్రేషన్ అధికారులు పథకం అమలుపై సమీక్ష జరుపుతారు, విసా మినహాయింపు ఉన్న కేటగిరీల జాబితాను అవసరమైన మేరకు సవరిస్తారు. గతంలోనూ కూడా భారత్ ఈ పథకం కింద పాక్‌కు ఇచ్చిన మినహాయింపులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అయితే, ఇలా పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవడం మాత్రం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్ బిన్ లాడెన్ లాంటోడు.. కశ్మీర్ దాడిపై అమెరికా అధికారి తీవ్ర ఆగ్రహం
న్యాయమూర్తులపై మహిళ సంచలన వ్యాఖ్య.. షాకిచ్చిన కోర్టు
ఇప్పటికే మాపై విమర్శలు.. తొలిసారిగా స్పందించిన సుప్రీం కోర్టు