PM Modi Avoided 4 Calls From Trump : ట్రంప్ నుంచి 4 ఫోన్ కాల్స్.. లిఫ్ట్ చేయని ప్రధాని మోదీ
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:52 PM
కొత్త ట్రేడ్ టారిఫ్స్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత ప్రధాని మోదీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్ నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా మోదీ కాల్స్ లిఫ్ట్ చేయలేదట..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త ట్రేడ్ టారిఫ్స్ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కినుక వహించినట్టు కనిపిస్తోంది. డోనాల్డ్ ట్రంప్ నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా ప్రధాని నరేంద్ర మోదీ.. ట్రంప్ కాల్స్ లిఫ్ట్ చేయనట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన నాలుగు కాల్స్‌ను స్వీకరించడానికి నరేంద్ర మోదీ నిరాకరించారని జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్గెమైన్ జైటంగ్ (FAZ) నివేదించింది. ఇది మోదీ కోపం లోతుని, ట్రంప్ చేష్టల పట్ల జాగ్రత్తని సూచిస్తోందని సదరు కథనం వెల్లడించింది. అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదని కూడా పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటానికి ప్రధాని మోదీ ఇష్టపడకపోవడం.. అమెరికా అధ్యక్షుడు తన చర్యలతో ప్రధాని మోదీని ఎంతగా చిరాకు పెట్టారో చూపిస్తోందని FAZ రాసుకొచ్చింది. చైనాను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ప్రయత్నంలో ఇండియా, అమెరికా గత రెండు దశాబ్దాలుగా దగ్గరయ్యాయి. కానీ ఇప్పుడు ట్రంప్ భారీ సుంకాలు విధిస్తుండటంతో చైనాను అదుపులో ఉంచడానికి అమెరికా తీసుకొచ్చిన ఇండో-పసిఫిక్ అలైన్‌మెంట్ కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
అటు, జపాన్ వార్తా పత్రిక నిక్కీ ఆసియా కూడా ఇలాంటి కథనమే ప్రచురించింది. ట్రంప్ కాల్స్‌ను ప్రధాని మోదీ తప్పించుకుంటున్నారని, ఇది ట్రంప్‌లో నిరాశను పెంచుతుందని రాసుకొచ్చింది. భారతీయ వస్తువులపై ట్రంప్ సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన తర్వాత న్యూఢిల్లీ - వాషింగ్టన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంత స్థాయిలో ట్రంప్ అధిక సుంకాలను ఎదుర్కొంటోంది బ్రెజిల్ తర్వాత ఇండియా మాత్రమే అని నిక్కీ ఆసియా చెప్పింది.
ఇలా ఉంటే, అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారతదేశం ఇప్పటికే నొక్కి చెప్పింది. దేశ రైతుల ప్రయోజనాల్లో ఎప్పటికీ రాజీ పడనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా రైళ్లు రద్దు.. అధికారులు ఆకస్మిక నిర్ణయం
కొండ చరియలు విరిగిపడి.. 30 మంది మృతి
For AP News And Telugu News