Landslide On Vaishno Devi Route: కొండ చరియలు విరిగిపడి.. 30 మంది మృతి
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:37 AM
కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్రా, రియాసీ ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 27: గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్ చిరుగుటాకులా వణుకుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. కట్రాలోని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 30కి పెరిగింది. ఈ మేరకు రియాసీ ఎస్ఎస్‌పీ పరమ్ వీర్ సింగ్ వెల్లడించారు. అయితే భారీ వర్షాల కారణంగా.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్.. వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే వైష్ణోదేవిని సందర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఉండేందుకు సైతం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ ప్రమాదంపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఘటన అత్యంత విషాదకరమైనది ఆయన అభివర్ణించారు. ఈ ఘటనపై ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు సీఎం ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వారితో స్పష్టం చేసినట్లు చెప్పారు. అలాగే ఈ ఘటన చోటు చేసుకోవడంతోనే.. ఎన్డీఆర్ఎఫ్‌ను సంఘటన స్థలానికి తరలించామని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా మేఘాలు విస్తరించి ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే తీవ్రమైన ఉరుములు, మెరుపురులతో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మరి ముఖ్యంగా కొండ వాలు ప్రాంతాలు, అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు.. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించింది. అదే విధంగా అధికారులు సూచించే భద్రతా సలహాలను పాటించాలని ప్రజలను కోరింది.
కంట్రోల్ నెంబర్లు ఏర్పాటు..
మరోవైపు వైష్ణోదేవి సందర్శన కోసం వచ్చిన భక్తుల కుటుంబాలు ఆందోళన చెందడం సహజం. ఈ నేపథ్యంలో పోలీస్ కంట్రోల్ రమూలు ఏర్పాటు చేశారు. కట్రా: 9149672792, రియాసీ: 9103996071.. ఈ నెంబర్ల ద్వారా యాత్రికుల పరిస్థితిని తెలుసుకోవచ్చు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు
భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు
For National News And Telugu News