PM Modi Gifts Auction: ప్రధాని మోదీ బర్త్ డే..తనకు వచ్చిన 1300 గిఫ్టుల వేలం, ఎందుకంటే..
ABN , Publish Date - Sep 17 , 2025 | 10:04 AM
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా కూడా ఓ అరుదైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తనకు వచ్చిన బహుమతులను ఆన్ లైన్ విధానంలో వేలం వేస్తారు. అయితే ఎందుకు అలా చేస్తున్నారు, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (సెప్టెంబర్ 17) తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి స్వయంగా మధ్యప్రదేశ్‌లో అనేక పథకాలను ప్రారంభించనున్నారు.
మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. భారత్ సహా విదేశాల నుంచి ఆయనకు అభిమానులు పింపిన బహుమతులు ఈ-వేలం వేస్తారు (PM Modi Gifts Auction). గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ బహుమతులలో పెయింటింగ్‌లు, అయోధ్య రామాలయం సహా అనేకం ఉన్నాయి.
ఈ సారి 1300కుపైగా..
ఈ ఏడాది 1,300కు పైగా వస్తువులు ఆన్‌లైన్ వేలంలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఏడో ఎడిషన్ వేలం సెప్టెంబర్ 17న, అంటే మోదీ 75వ జన్మదినం రోజున ప్రారంభమై, అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. ఈ వేలంలో భవానీ దేవి విగ్రహం, అయోధ్య రామ మందిరం మోడల్, పారాలింపిక్స్ 2024లో పతకాలు గెలిచిన ఆటగాళ్లు ధరించిన షూస్ జతలు, పశ్మినా శాలువా, తంజోర్ పెయింటింగ్, నటరాజ విగ్రహం, రోగన్ ఆర్ట్‌వర్క్, నాగా శాలువా వంటి అనేక విలువైన వస్తువులు ఉన్నాయి.
వేలంలో ప్రముఖ వస్తువులు
ఈ వేలంలో అత్యంత ఆకర్షణీయమైన వస్తువుల్లో ఒకటి భవానీ దేవి విగ్రహం. దీని ధర రూ. 1.03 కోట్లు. అలాగే, అయోధ్య రామ మందిరం మోడల్ రూ. 5.5 లక్షల ధరతో లిస్టులో ఉంది. పారిస్ పారాలింపిక్స్ 2024లో పతకాలు సాధించిన భారత పారా-అథ్లీట్లు ధరించిన మూడు జతల షూస్ కూడా ఈ వేలంలో హైలైట్ అని చెప్పవచ్చు. ఒక్కో జత షూస్ ధర రూ. 7.7 లక్షలు.
ఇంకా, జమ్మూ కశ్మీర్‌కు చెందిన పశ్మినా శాలువా, రామ దర్బార్‌ను చిత్రించిన తంజోర్ పెయింటింగ్, లోహంతో తయారైన నటరాజ విగ్రహం, గుజరాత్‌కు చెందిన రోగన్ ఆర్ట్‌వర్క్, చేతితో నేసిన నాగా శాలువా వంటి సాంప్రదాయక వస్తువులు కూడా వేలంలో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా పారిస్ పారాలింపిక్స్‌లో భారత పారా-అథ్లీట్లు అందించిన క్రీడా వస్తువులు ఉన్నాయి.
వేలం ఎక్కడ, ఎప్పుడు?
ఈ వస్తువులు ప్రస్తుతం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో ప్రదర్శనలో ఉన్నాయి. సంస్కృతి, పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ వేలం గురించి ప్రకటించారు. ఈ వేలం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు pmmementos.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ వస్తువులను చూసి, వేలంలో పాల్గొనవచ్చు.
నమామి గంగే ప్రాజెక్ట్‌కు సహకారం
2019 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేలం ద్వారా సేకరించిన నిధులు గంగా నదిని శుభ్రపరచడానికి, సంరక్షించడానికి ఉద్దేశించిన నమామి గంగే ప్రాజెక్ట్‌కు వెళ్తాయి. ఇప్పటివరకు ఈ వేలాల ద్వారా రూ. 50 కోట్లకు పైగా నిధులను సేకరించారు. ఈ నిధులు గంగా నది పరిశుభ్రతకు, దాని సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇందులో పాల్గొనడం ద్వారా మీరు కేవలం అరుదైన, చారిత్రక వస్తువులను సొంతం చేసుకోవడమే కాకుండా, గంగా నది సంరక్షణ వంటి కార్యక్రమానికి సహకరిస్తారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి