Share News

PM Modi: కెనడా చేరుకున్న ప్రధాని మోదీ

ABN , Publish Date - Jun 17 , 2025 | 08:13 AM

జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కెనడా చేరుకున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నేతలు హాజరుకానున్నారు.

PM Modi: కెనడా చేరుకున్న ప్రధాని మోదీ
PM Modi

న్యూఢిల్లీ, జూన్ 17: ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా కెనడాలోని కాల్గరీ నగరానికి మంగళవారం చేరుకున్నారు. కననాస్కిస్ వేదికగా ఈ రోజు జరగనున్న 51వ జీ 7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఈ సదస్సుకు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌ స్కీతోపాటు వివిధ దేశాల నేతలు పాల్గొనున్నారు. ఈ సదస్సులో భాగంగా కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీతోపాటు వివిధ దేశాల నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే సదస్సులో ప్రధాని మోదీ, జెలెన్ స్కీతోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా తదితర దేశాలకు చెందిన నేతలు పాల్గొనున్నారు.


ఈ సందర్బంగా ప్రపంచంలో జీ -7 దేశాల ప్రజల రక్షణ, ఇంధన భద్రతను పెంచడం, డిజిటల్ రంగాన్ని వేగవంతం చేయడం, భవిష్యత్తు భాగస్వామ్యాలు సురక్షితం చేయడం వంటి తదితర అంశాలను ఈ సదస్సులో ప్రధానంగా నేతలు చర్చించనున్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే సైప్రస్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి సైప్రస్ ప్రభుత్వం బహుకరించిన సంగతి తెలిసిందే. అలాగే సైప్రస్ ఇచ్చిన అతిథ్యంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీ కెనడా నుంచి క్రొయేషియాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి రానున్నారు.


మరోవైపు ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాలు, ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ సదస్సుకు వివిధ దేశాల నేతలు హాజరవుతున్నారు. ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మేలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ అనంతరం ప్రధాని మోదీ పాల్గొంటున్న తొలి సదస్సు ఇది. మూడు దేశాల విదేశీ పర్యటన కోసం ప్రధాని మోదీ జూన్ 15న ఢిల్లీ నుంచి సైప్రస్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.


ప్రధాని మోదీ పర్యటనకు ప్రాధాన్యత..

ప్రధాని మోదీ కెనడా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే.. 2023లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. ఈ ఘటన అనంతరం భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు దాదాపుగా తెగిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి వేళ.. ప్రధాని మోదీ కెనడా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ కెనడా ప్రధాని మార్క్ కార్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. మోదీ పర్యటనతో మళ్లీ ఈ ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగు పడే అవకాశముందనే చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

పూజలు పేరుతో దారుణం..

ఎవరా ఐఏఎస్‌‌లు..?

For National News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 08:49 AM