Railway Tickets New Policy: కన్ఫర్మ్‌డ్ టిక్కెట్లల్లో ప్రయాణ తేదీ మార్పుకు ఛాన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 09:17 PM
కన్ఫర్మ్‌డ్ టిక్కెట్స్ ఉన్న ప్యాసెంజర్లు తమ జర్నీ తేదీని ఉచితంగా మరో రోజుకు మార్చుకునే అవకాశం లభించనుంది. ఈ మేరకు రైల్వేకు మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎంత జాగ్రత్తగా ప్రయాణాల్ని ప్లాన్ చేసుకున్నా ఒక్కోసారి జర్నీ తేదీల్లో మార్పులు తప్పవు. చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకోవడమో లేక మరో రోజుకు వాయిదా వేసుకోవడమో చేయాల్సి రావొచ్చు. అయితే, రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు (Train Ticket Rebooking Without Fee).
జర్నీ షెడ్యూల్‌లో మార్పు తలెత్తిన ప్రయాణికులు తమ కన్ఫర్మ్‌డ్ రైలు టిక్కెట్ల ప్రయాణ తేదీలను ఉచితంగా మార్చుకునేందుకు అవకాశం ఇచ్చేలా రైల్వేకు సూచనలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రయాణికులకు ప్రయోజనకరం కాదని తెలిపారు. ప్రయాణికులకు లాభం చేకూర్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, తేదీ మార్పు తరువాత మళ్లీ కన్ఫర్మ్‌డ్ టిక్కెట్ వస్తుందా లేదా అన్నది సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. కొత్త జర్నీ డేట్‌కు మళ్లీ కన్ఫర్మ్‌డ్ టిక్కెట్ వస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదని అన్నారు. ఇక తేదీ మార్పు తరువాత ధరలు పెరిగితే ఆ మేరకు అదనపు చార్జీని కూడా ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. జనవరి నుంచీ ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది (Reschedule train tickets India).
ఇక తాజా నిర్ణయంతో లక్షల మంది ప్రయాణికులు ప్రయోజనం పొందనున్నారు. తమ ప్రయాణాల్ని అదనపు ఖర్చు లేకుండా రీషెడ్యూల్ చేసుకోగలుగుతారు. ఇప్పటివరకూ ప్రయాణికులు తమ జర్నీని వాయిదా వేసుకోవాల్సి వస్తే టిక్కెట్లు రద్దు చేసుకునేవారు. క్యాన్సిల్ చేసుకున్న తేదీని బట్టి కొంత డబ్బును కూడా వదులుకునేవారు. మరో తేదీ కోసం మళ్లీ మరో టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి వచ్చేది. రైలు ప్రయాణానికి 12 గంటల నుంచి 48 గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే టిక్కెట్ ధరలో 75 శాతం మాత్రమే ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తోంది. ఇక జర్నీకి 4 గంటల నుంచి 12 గంటల ముందు టిక్కెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే మరింత సొమ్మును కోల్పోవాల్సి ఉంటుంది. ఇక రిజర్వేషన్ చార్ట్ తయారు చేశాక టిక్కెట్స్‌ను క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్స్‌ను ఉండవు. తాజా నిర్ణయంతో ఈ ఇబ్బందుల్లో చాలా మటుకు తొలగిపోనున్నాయి.
ఇవి కూడా చదవండి:
ప్రయాణికులకు శుభవార్త.. దీపావళి, ఛట్ పూజ సందర్భంగా 12000 ప్రత్యేక రైళ్లు
ఎయిరిండియా ప్రమాదంపై పారదర్శకంగా దర్యాప్తు.. రామ్మోహన్ నాయుడు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి