Parliament Disruption: ఉభయసభల్లో సర్ గందరగోళం
ABN , Publish Date - Jul 26 , 2025 | 03:08 AM
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది.
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై విపక్ష సభ్యుల నిరసన
న్యూఢిల్లీ, జూలై 25: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. విపక్ష సభ్యుల ఆందోళనలతో ఉభయసభల్లో ఎలాంటి కార్యకలాపాలూ కొనసాగడం లేదు. బిహార్‌లో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్-సర్)’పై శుక్రవారం కూడా ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగించాయి. ఫలితంగా వర్షాకాల సమావేశాల్లో తొలి వారం మొత్తం తుడిచిపెట్టుకు పోయినట్లయింది. ఏ అంశంపైన అయినా చర్చించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా.. విపక్ష సభ్యులు మాత్రం పట్టించుకోకుండా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారం లోక్‌సభ సమావేశమైన వెంటనే విపక్ష సభ్యులు నినాదాలు, ప్లకార్డులతో నిరసనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. 2 గంటలకు సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు సర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ స్పందిస్తూ.. ‘‘ఈ గందరగోళం, రభస వల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు. ప్రజలు వారి సమస్యలను లేవనెత్తుతారని మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. కానీ, మీరు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారు. సభను వాయిదా వేయించడం అంటే ఏదో సాధించినట్లు కాదు. ఇది ఆందోళనకరమైన అంశం. యావత్ దేశానికే హానికరం’’ అని విపక్ష సభ్యులకు హితవు పలికారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో ఎలాంటి కార్యకలాపాలూ జరగకుండానే సభ వాయిదా పడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇండీ కూటమికి చెందిన పలువురు ఎంపీలు ‘సర్’ పోస్టర్లను చించివేశారు. పార్లమెంటు భవన సముదాయంలోని చెత్తబుట్టల్లో వాటిని పడేసి, నిరసన ప్రదర్శన చేశారు. సర్‌ను ఉపసంహరించుకోవాలని, దీనిపై ఉభయసభల్లో చర్చ జరపాలని అన్నారు.
నిప్పుతో చెలగాటం వద్దు: స్టాలిన్
బిహార్‌లో ఓట్ల తొలగింపుపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. నిప్పుతో చెలగాటమాడవద్దని బీజేపీని హెచ్చరించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టాలిన్ శుక్రవారం ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా, బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన 99.8% పూర్తయినట్లు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) కార్యాలయం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News