Pakistani Drones In Poonch: సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు... బలగాలు అప్రమత్తం
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:07 PM
నిఘా కోసం పాక్ డ్రోన్లను ప్రయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్న భద్రతా దళాలు సోమవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. డ్రోన్లతో ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడిచి ఉండచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir) పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ డ్రోన్లు (Pakistani Drones) కలకలం సృష్టించాయి. ఆదివారం రాత్రి సరిహద్దు అవతల 6 డ్రోన్లు ఎగురుతూ కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. రాత్రి 9.15 గంటలకు డ్రోన్ల కదలికలు మెంథార్ సెక్టార్‌లో కనిపించాయని, వెంటనే అడ్డుకునేందుకు వీల్లేనంత ఎత్తులో ఎగురుతూ, కొద్ది నిమిషాలకే పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాయని అధికారులు తెలిపారు.
నిఘా కోసం ఈ డ్రోన్లను పాక్ ప్రయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్న భద్రతా దళాలు సోమవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. డ్రోన్లతో ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడిచి ఉండచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో పాకిస్థాన్ అక్రమ కార్యకలాపాలకు డ్రోన్ల వాడకం పెరిగింది. స్మగ్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తూ, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, నార్కోటిక్స్‌ను భారత భూభాగంలోకి జారవిడుస్తోంది. సరిహద్దు చొరబాట్లు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న భద్రతా బలగాలకు దాయాది దేశం చర్యలు కీలక సవాళ్లుగా మారుతున్నాయి. గత మూడు రోజుల్లో పాక్ డ్రోన్లు కనిపించడం ఇది రెండోసారి. దీనికి ముందు జమ్మూలోని గజాన్సూ ఏరియాలో ఒక డ్రోన్‌ను స్థానికులు గుర్తించారు. అయితే ఎలాంటి సామగ్రిని జారవిడచకుండా డ్రోన్ వెనక్కి వెళ్లిపోయిందని చెబుతున్నారు.
ప్రోత్సాహకాలు
డ్రోన్ల స్మగ్లింగ్ ముప్పును ఎదుర్కోవడంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ జమ్మూకాశ్మీర్ పోలీసులు రూ.3లక్షల రివార్డును కూడా ప్రకటించారు. డ్రోన్లు కనిపించినట్టు విశ్వసనీయమైన సమాచారం ఇచ్చిన వారికి ఈ రివార్డు ఇస్తారు. గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి ఈ ప్రోత్సాహకాలను ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంఓ కీలక సమావేశం
ఈడీ దాడుల్లో పారిపోయేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే అరెస్టు
For More National News