LoC Tension: ఎల్వోసీపై ప్రభావం
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:45 AM
పాకిస్థాన్ సిమ్లా ఒప్పందం నిలిపివేతతో ఎల్వోసీపై కట్టుబాటు తొలగి, కశ్మీర్ వివాదంలో మూడోపక్ష జోక్యం కోరే ప్రయత్నాలు ముమ్మరం కావచ్చు, దీర్ఘకాలంలో ప్రాంతీయ స్థిరత్వానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది
పాక్ నిర్ణయంతో దీర్ఘకాలంలో సరిహద్దు, కశ్మీర్ అంశాలు సంక్లిష్టం
1972లో యుద్ధం అనంతరం చరిత్రాత్మక సిమ్లా ఒప్పందం
ఎల్వోసీ ఉనికిలోకి వచ్చింది కూడా అప్పుడే
మూడోపక్షం జోక్యం వద్దన్న నిబంధన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పాకిస్థాన్ నుంచి విముక్తి కోరుతూ తూర్పు పాకిస్థాన్ ప్రజలు జరిపిన విముక్తి పోరాటానికి భారత్ మద్దతు పలకటం, ఆ నేపథ్యంలో పాక్ భారత సైన్యంపై దాడులకు దిగటంతో.. 1971లో ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ గొప్ప విజయం సాధించటమేగాక.. పాకిస్థాన్‌లోని 13 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధం నేపథ్యంలోనే బంగ్లాదేశ్ స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది. యుద్ధం అనంతరం.. భారత్-పాక్ సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 1972 జూలై 2వ తేదీన ఈ ఒప్పందంపై నాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి స్వస్తి పలికి స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పుకోవటం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని నాడు భారత్-పాక్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
ఒప్పందంలోని ప్రధానాంశాలు
ఏ దేశమూ ఏకపక్షంగా వ్యవహరించి శాంతికి భంగం కలిగించే పనులకు పాల్పడవద్దు.
ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోవద్దు.
ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే అన్ని విబేధాలను పరిష్కరించుకోవాలి. మూడోపక్షం జోక్యం వద్దు
1971 యుద్ధం కాల్పుల విరమణ సమయంలో ఉన్న స్థితినే సిమ్లా ఒప్పందం.. జమ్మూకశ్మీర్‌లో ఇరుదేశాల సరిహద్దుగా (లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్వోసీ)గా మార్చింది.
యుద్ధం సందర్భంగా భారత సైన్యం స్వాధీనం చేసుకున్న 13,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్థాన్‌కు తిరిగి ఇవ్వటానికి భారత్ అంగీకరించింది. శాంతికి కట్టుబడి ఉన్నామని చెప్పటానికి భారత్ ఇందుకు సమ్మతించింది. అయితే టర్టుక్, చాలుంకా వంటి కొన్ని వ్యూహాత్మక కీలకమైన ప్రాంతాలను మాత్రం భారత్ తన వద్దే ఉంచుకుంది.
ఒప్పందం నిలిపివేతతో జరిగేదేమిటి?
సిమ్లా ఒప్పందం అమలును నిలిపివేయాలని పాకిస్థాన్ తాజాగా నిర్ణయించింది. దీని వల్ల సంభవించే పరిణామాలు తక్షణం కాకపోయినా, దీర్ఘకాలంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మలిచే ప్రయత్నాలను ముందు నుంచీ చేస్తున్న పాక్ ఇక మీదట వాటిని మరింత ముమ్మరం చేయవచ్చు. కశ్మీర్ వివాదంలో మూడోపక్షం జోక్యం దిశగా పాక్ అడుగులు వేసే అవకాశం ఉంది. ఐరాస లేదా చైనా వంటి తన మిత్రదేశాల జోక్యాన్ని పాకిస్థాన్ కోరవచ్చు.సిమ్లా ఒప్పందాన్ని పక్కకపెడితే.. ఎల్వోసీకి కట్టుబడాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే ఎల్వోసీని ఉల్లంఘిస్తూ తరచూ కాల్పుల ఘటనలు చేసుకుంటున్నాయి. ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉంది. తక్షణం కాకపోయినా, దీర్ఘకాలంలో.. ప్రాంతీయ స్థిరత్వానికి భంగం వాటిల్లి, భారత్-పాక్ మధ్య చర్చలకు దారులు పూర్తిగా మూసుకుపోయే పరిస్థితులు ఏర్పడవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్