Share News

Narendra Modi: మన సైన్యం దాడులను చూసి యుద్ధం ఆపాలని వేడుకున్నారు..

ABN , Publish Date - May 30 , 2025 | 06:57 PM

భారత సైన్యం ధైర్యాన్ని చూసి పాకిస్థాన్ సైన్యం యుద్ధాన్ని ఆపాలని వేడుకుందని ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన సైన్యం ధైర్యసాహసాలకు మళ్లీ మళ్లీ సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు ప్రధాని. యూపీ కాన్పూర్ పర్యటన సందర్భంగా మోదీ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Narendra Modi: మన సైన్యం దాడులను చూసి యుద్ధం ఆపాలని వేడుకున్నారు..
PM Modi Kanpur Visit

ఉత్తర్ ప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మే 30, 2025న) ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రూ.47,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య ఐశాన్యను ప్రధాని మోదీ (Narendra Modi), కలిశారు. ఆమె కళ్లలో కన్నీటిని చూసి ప్రధాని కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.


హెచ్చరించిన ప్రధాని మోదీ..

పాకిస్థాన్ లోపల వందల మైళ్ల దూరంలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను మన సైన్యం నాశనం చేశాయని ప్రధాని మోదీ అన్నారు. మన సైన్యం దాడులను చూసి చివరకు పాకిస్థాన్ సైన్యం యుద్ధాన్ని ఆపమని వేడుకోవాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ ఈ ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రతి ఉగ్రదాడికి భారతదేశం తగిన సమాధానం ఇస్తుందని ప్రధాని మోదీ 3 కీలక అంశాలను ప్రకటించారు. ఉగ్రవాదం విషయంలో సమాధానం ఇచ్చే సమయం, పద్ధతి, షరతులను మన సైన్యమే స్వయంగా నిర్ణయిస్తుందన్నారు. భారతదేశం ఇకపై అణు బాంబు బెదిరింపులకు భయపడదన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని భారత్ ఒకే దృష్టితో చూస్తుందని, ఇకపై పాకిస్థాన్ ఆట ఎక్కువ కాలం కొనసాగదన్నారు.


ఆపరేషన్ సిందూర్ రూపంలో..

ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ.. ఈ అభివృద్ధి కార్యక్రమం ఏప్రిల్ 24న జరగాల్సి ఉందని, కానీ పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా కాన్పూర్ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. పహల్గామ్‌లో జరిగిన పిరికి ఉగ్రదాడిలో కాన్పూర్ కుమారుడు శుభం ద్వివేది కూడా ప్రాణాలు కోల్పోయాడని, ఆ క్రమంలో మనమందరం కుమార్తె ఐశాన్య బాధ, కోపాన్ని అనుభవించామని గుర్తు చేశారు. దీనికి ఆపరేషన్ సిందూర్ రూపంలో మన కూతుళ్ల బాధ, కోపంపై రివేంజ్ తీర్చుకున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ.


మన ఆయుధ శక్తి..

ఇకపై శత్రువు ఎక్కడ ఉన్నా బెదిరిపోతాడని కాన్పూర్ భాషలో చెప్పారు మోదీ. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం స్వదేశీ ఆయుధాల శక్తిని, మేక్ ఇన్ ఇండియా శక్తిని ప్రపంచం చూసిందన్నారు. మన భారతీయ ఆయుధాలు, బ్రహ్మోస్ క్షిపణి శత్రువు ఇంట్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాయని గుర్తు చేశారు. లక్ష్యాన్ని నిర్ణయించిన చోట పేలుళ్లు జరిగాయని, స్వావలంబన భారతదేశం సంకల్పం నుంచి మనకు శక్తి వచ్చిందని స్పష్టం చేశారు. కాన్పూర్‌కు చెందిన 31 ఏళ్ల శుభం ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఐశాన్యను వివాహం చేసుకున్నాడు. ఏప్రిల్ 22న, వీరు కాశ్మీర్‌ సందర్శించడానికి వెళ్లినప్పుడు, బైసారన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో శుభం ద్వివేది సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఇవీ చదవండి:

నీట్ పీజీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 08:08 PM