Rahul Gandhi: బిహార్‌ను నేరాల రాజధానిగా మార్చేశారు
ABN , Publish Date - Jul 06 , 2025 | 02:56 PM
వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా తన నివాసం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఖేమ్కా కారు దిగుతుండగా బైక్‌పై వచ్చిన అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఖేమ్కా మృతి చెందారు. ఖేమ్కాకు మగధ్ ఆసుపత్రి, పలు పెట్రోల్ పంప్‌లు ఉన్నాయి.
న్యూఢిల్లీ: పాట్నాలో వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యకు గురికావడంపై బిహార్ ప్రభుత్వాన్ని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. దేశంలో బిహార్‌ను నేరాల రాజధానిగా బీజేపీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మార్చారని రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నేరాలు సర్వసాధారణంగా మారిపోయాయని అన్నారు. ప్రజలను కాపాడుకోలేని ప్రభుత్వానికి ఓటు వేయద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలే కాదని, బిహార్ ప్రభుత్వాన్ని కాపాడుకునే ఎన్నికలని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ పేర్కొన్నారు.
గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి తన నివాసం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఖేమ్కా కారు దిగుతుండగా బైక్‌పై వచ్చిన అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఖేమ్కా మృతి చెందారు. ఖేమ్కాకు మగధ్ ఆసుపత్రి సహా పలు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఆయన కుమారుడు ఒక భూమి తగాదాలో హజీపూర్‌లో ఏడేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఖేమ్కా హత్య రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
దీనిపై రాహుల్ తీవ్ర విమర్శలు చేస్తూ.. వ్యాపారవేత్త హత్యతో బీజేపీ, నితీశ్ కుమార్ కలిసి బిహార్‌ను నేర రాజధానిగా మార్చినట్టు నిరూపణ అయిందన్నారు. లూటీలు, బుల్లెట్లు, హత్యల నీడలో బిహార్ బిక్కుబిక్కుమంటూ బతుకుతోందని విమర్శించారు. రాష్ట్రంలో నేరాలు సర్వసాధారణంగా మారాయని, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. 'సోదర సోదరీమణులారా.. అన్యాయాన్ని ఇంకెతమాత్రం సహించకూడదు. ప్రజలను కాపాడలేని ప్రభుత్వం మీ పిల్లల భవిష్యత్తును పరిరక్షించలేదు. ప్రతి హత్య, లూటీ, బుల్లెట్ కూడా మార్పును ఆకాంక్షిస్తున్నాయి. ప్రగతి, నిర్భీతి జీవనానికి భరోసా ఇచ్చే సరికొత్త బిహార్‌ను రూపొందించేందుకు ఇదే తగిన తరుణం. ఇవి కేవలం ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కావు, బిహార్‌ను కాపాడుకునే ఎన్నికలు' అని రాహుల్ అన్నారు.
ఖేమ్కా హత్యను సవాలుగా తీసుకున్నాం..
కాగా, ఖేమ్కా హత్యను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందని బిహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. సిట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. నేరస్థులను విడిచిపెట్టవద్దనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని బిహార్ పోలీసులను హెచ్చరించారని తెలిపారు. నేరాల రాజధానిగా బిహార్‌ను పేర్కొంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
ఇవి కూడా చదవండి..
ఆ బంగ్లా తక్షణం ఖాళీ చేయండి.. మాజీ సీజేఐకి సుప్రీంకోర్టు నోటీసులు
రాయిటర్స్ ఎక్స్ అకౌంట్ నిలుపుదల.. స్పందించిన భారత్..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి