Share News

Vice President Election 2025: రామమందిరంలో పూజలు చేసిన రాధాకృష్ణన్, గెలుపుపై ఎవరి ధీమా వారిదే

ABN , Publish Date - Sep 09 , 2025 | 09:48 AM

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా బి.సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్నారు.

Vice President Election 2025: రామమందిరంలో పూజలు చేసిన రాధాకృష్ణన్, గెలుపుపై ఎవరి ధీమా వారిదే
CP Radhakrishnan and B.Sudarshan reddy

న్యూఢిల్లీ: దేశ 17వ ఉప రాష్ట్రపతి ఎన్నిక (Vice President Election)కు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు కొత్త భవనంలో ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలతో పోలింగ్ ముగుస్తుంది. 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan), కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా బి.సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఓటింగ్‌కు ముందు సీపీ రాధాకృష్ణన్ లోథి రోడ్ ప్రాంతంలోని శ్రీరామ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. భారత జాతీయవాదం పెద్ద విజయం సాధించనుందని రాధాకృష్ణన్ ఈ సందర్భంగా అన్నారు. 'మనమంతా ఒకటి, ఒకటిగానే ఉంటాం, ఇండియా వికసత్ భారత్ కావాలన్నదే అందరి అభిమతం' అని ఆయన అన్నారు.


ఉపరాష్ట్రపతి పదవికి వన్నెతెస్తారు: మోదీ

ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిత్వంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాధాకృష్ణన్ అత్యద్భుతమైన ఉపరాష్ట్రపతి అవుతారని, పదవి ఔన్నత్యాన్ని పెంచుతారని దేశ ప్రజలంతా విశ్వసిస్తున్నట్టు తెలిపారు.


గెలుపుపై ఎవరి ధీమా వారిదే

ఉప రాష్ట్రపతి అభ్యర్థి గెలుపునకు 391 ఓట్లు అవసరం కాగా, ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌కు కనీసం 437 మంది సభ్యుల బలం (56 శాతం) కనిపిస్తోంది. దీంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే కానుందనే అంచనాలు ఉన్నాయి. బి.సుదర్శన్ రెడ్డికి 323 ఓట్ల వరకూ రావచ్చని అంచనా. కాగా, తమ అభ్యర్థుల గెలుపుపై ఎన్డీయే, ఇండియా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


భారీ మెజారిటీతో ఎన్డీయే అభ్యర్థి గెలువనున్నట్టు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన విజయానికి అన్ని ప్రయత్నాలు చేసినట్టు చెప్పారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆయన అభ్యర్థిత్వానికి విపక్ష సభ్యులు మద్దతు తెలిపితే స్వాగతిస్తామని అన్నారు. 100 శాతం రాధాకృష్ణన్ విజయం ఖాయమని బీజేపీ ఎంపీ రామ్‌భాయ్ మోకరియా అన్నారు. విపక్ష అభ్యర్థి గెలువబోవడం లేదన్నారు. గెలుపునకు అవసరమైన దానికంటే ఎక్కువ సంఖ్యా ఎన్డీయేకు ఉందని బీజేపీకి చెందిన మరో ఎంపీ అనంత్ నాయక్ అన్నారు. దేశానికి తదుపరి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఖాయమని చెప్పారు. తమ అభ్యర్థిగా అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరగవచ్చని ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ ప్రదీప్ పురోహిత్ అన్నారు.


బలపరచండి: సుదర్శన్ రెడ్డి

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి పార్లమెంటు సభ్యులను కోరారు. జాతీయ ఆత్మను ప్రతిబించేలా ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు. తన గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, సుదర్శన్‌రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే అభిప్రాయన్ని పలువురు విపక్ష నేతలు వ్యక్తం చేసారు.


ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడే

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 10:50 AM