Vice Presidential Election Today: ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడే
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:34 AM
ఒకరు బాల్యం నుంచీ హిందూత్వ భావజాలంతో ఎదిగిన జాతీయవాది అయితే మరొకరు సోషలిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న ఉదారవాది. ఉప రాష్ట్రపతి పదవికి మంగళవారం జరిగే ఎన్నికల్లో ..
జాతీయవాది,ఉదారవాది మధ్య సైద్దాంతిక సమరం
ఎన్డీఏ నుంచి వివాద రహితుడు సీపీ రాధాకృష్ణన్
ఇండియా అభ్యర్థిగా న్యాయ కోవిదుడు సుదర్శన్‌రెడ్డి
పోలింగ్‌కు దూరమని ప్రకటించిన బీఆర్‌ఎస్, బీజేడీ
422 మంది సభ్యుల బలంతో ఎన్డీఏదే పైచేయి
నేడు సాయంత్రానికి ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఒకరు బాల్యం నుంచీ హిందూత్వ భావజాలంతో ఎదిగిన జాతీయవాది అయితే మరొకరు సోషలిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న ఉదారవాది. ఉప రాష్ట్రపతి పదవికి మంగళవారం జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సీపీ రాధాకృష్ణన్, ఇండీ కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్‌రెడ్డిల మధ్య జరుగుతున్న పోటీ గతంలో ఎన్నడూ లేనివిధంగా సైద్దాంతిక సమరాన్ని తలపిస్తోంది. రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికై మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న అత్యంత వివాదరహితుడు సీపీ రాధాకృష్ణన్, దాదాపు రెండు దశాబ్దాల పాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డిలలో ఎవర్ని రెండవ రాజ్యాంగ ఉన్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఉభయ సభల పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటారో అన్నది మంగళవారం సాయంత్రానికి తేలనుంది. సంఖ్యాబలం రీత్యా చూస్తే ఎన్డీఏ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో నెగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరు వర్గాలు ఈ ఎన్నికలో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లు సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.
ఓటేసేది 770 మందే
మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లోక్‌సభలో ఒక సీటు ఖాళీగా ఉన్న రీత్యా 542 మంది సభ్యులు, రాజ్యసభలో ఆరు సీట్లు ఖాళీ ఉన్న రీత్యా 239 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఉభయ సభల్లో మొత్తం 781 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా బీజేడీ నుంచి ఏడుగురు, బీఆర్‌ఎస్ నుంచి నలుగురు ఓటింగ్‌కు గైరుహాజరు కావాలని నిర్ణయించడంతో కేవలం 770 మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొననున్నారు. వీరిలో 386 ఓట్లు ఎవరికి లభిస్తే వారు ఉప రాష్ట్రపతి అవుతారు.
ఇండీ కూటమి 42 ఓట్ల దూరం
జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్దవ్ థాకరే), ఎన్‌సీపీ(శరద్ పవార్), ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, జేఎంఎం, సీపీఐఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, వీసీకే, భారత్ ఆదివాసీ పార్టీ, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, ఆర్‌ఎల్‌టీపీ, ఆర్‌ఎ్‌సపీ, ఎంఎన్‌ఎం(కమల్ హాసన్) ఏజీఎం, కేరళ కాంగ్రె్‌స(మణి) మద్దతును ప్రకటించాయి. ఇండియా కూటమికి కనీసం 324 ఓట్లు లభించే అవకాశాలున్నాయి. దాదాపు 100 ఓట్లకు పైగా వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇరు వర్గాలు కొద్ది రోజులుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ తన ఎంపీలను ఢిల్లీకి రప్పించి వర్క్‌షాప్ నిర్వహించింది. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ స్వయంగా వచ్చి తెలుగుదేశం ఎంపీలందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్క ఓటు కూడా వృధా కానివ్వొద్దని, రాధాకృష్ణన్ గెలుపు ప్రజాస్వామ్యానికి అవశ్యమని సూచించారు. ఇండీ కూటమి కూడా తమ ఎంపీలందర్నీ ఢిల్లీలో మోహరించింది. కాంగ్రెస్ తన ఎంపీలతో మాక్ ఓటింగ్ నిర్వహించి, వారికి శిక్షణనిచ్చింది. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి దేశవ్యాప్తంగా పర్యటించి, ఇండియా కూటమి నేతలను కలుసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూటమి నేతలందరితోనూ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఒక్క ఓటు కూడా వృధా కాకుండా అందర్నీ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్డీఏకి గెలిపించేంత బలం
ఎన్డీఏకు ఇప్పటికే 422 మంది సంఖ్యాబలం (లోక్ సభలో 293, రాజ్యసభలో 129) ఉన్నది. బీజేపీకి టీడీపీ, జేడీయూ, శివసేన(షిండే) లోక్ జనశక్తి(చిరాగ్ పశ్వాన్), అన్నాడీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్‌దళ్, అప్నాదళ్(సోనేలాల్), ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం, ఆల్ జార్ఖండ్ స్టుడెంట్స్ యూనియన్, హిందూస్తానీ ఆవామ్ మోర్చా, సిక్కిం క్రాంతికారీ మోర్చా, ఏజీపీ, యుపిపిఎల్, ఎన్‌పీపీ, ఆర్‌ఎల్ ఎం, టీఎంసీ, ఆర్‌పీఐ, వైసీపీ, పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు మద్దతునిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News