Narak Chaturdashi 2025: ఇవాళే నరక చతుర్దశి.. ఉదయాన్నే ఇలా చేయండి!
ABN , Publish Date - Oct 19 , 2025 | 07:58 AM
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈరోజున తెల్లవారకముందే నువ్వులనూనే తలపై వేసుకుని ” ఉత్తరేణి” కొమ్మను నెత్తి మీద ఉంచుకుని తల స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో “ శీతలోష్ణ సమాయుక్త సకంటకదళాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః అని మంత్రం పఠనం చేయాలి.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 19: హిందువులు జరుపుకునే అన్ని పండుగల్లోకెల్లా చాలా ప్రముఖమైన పండుగ దీపావళి. దేశంలోని అన్ని రాష్ట్రాలు దీపావళిని జరుపుకుంటాయి. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూజలు చేసి సాయంత్రం ఇంటినిండా దీపాలతో అలంకరించుకుంటారు. దీపావళి పండుగను ముఖ్యంగా మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ధన త్రయోదశి (దంతెరాస్), రెండవది నరక చతుర్దశి, ఇక మూడవది దీపావళి. మొదటిరోజున ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి, దేవాలయాలను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ముఖ్యంగా ఇంట్లో సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించి ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. బంధు మిత్రులతో దేవతారాధన చేసి అందరూ కలిసి మధుర పధార్ధాలతో భోజనం చేస్తారు. ఈ రోజున బంగారం కొనడం, అలాగే దానం చేయడం అత్యంత శుభ ఫలితన్ని ఇస్తుంది.
ఇక రెండవ రోజైన నరక చతుర్దశి రోజున పురాణ గాథలను స్మరిస్తూ దేవతారాధన చేసుకుంటాం. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి రోజునాడు నరక చతుర్దశి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించుకుంటాం. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో నరక చతుర్దశిని ఘనంగా జరుపుకుంటాం. నరక చతుర్దశి రోజుకు సంబంధించి హిందూ పురాణాల్లో అనేక గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీ కృష్ణుడి భార్య అయినటువంటి సత్యభామ ఈరోజునే నరకాసురుని వధించి భూభారహరణాన్ని చేశారని చెబుతారు. అలాగే త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడు, రావణాసురున్ని వధించిన తరువాత దీపావళి రోజునే అయోధ్యకు తిరిగి వస్తారు. తమ రాజు అయోధ్యకు వచ్చినందుకు స్వాగతం చెప్తూ రాజ్యమంతా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు.
తెలుగు పంచాంగం ప్రకారం అక్టోబర్ 19, ఆదివారం మధ్యాహ్నం 1.51 గంటల నుంచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మళ్ళీ అక్టోబర్ 20న మధ్యాహ్నం 3.44 గంటలకు చతుర్దశి ముగుస్తుంది. సూర్యోదయంతో పండుగ చేసుకునేవారు అక్టోబర్ 20, సోమవారం ఉదయం నరక చతుర్దశిగా, సాయంత్రం దీపావళి పండుగను చేసుకోవచ్చు. కొందరు పండితులు మాత్రం అక్టోబర్ 19, ఆదివారం రోజునే నరక చతుర్దశి జరుపుకోవాలని చెబుతున్నారు.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈరోజున తెల్లవారకముందే నువ్వులనూనే తలపై వేసుకుని ” ఉత్తరేణి” కొమ్మను నెత్తి మీద ఉంచుకుని తల స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో “ శీతలోష్ణ సమాయుక్త సకంటకదళాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః అని మంత్రం పఠనం చేయాలి. స్నానం చేసిన తరువాత నల్లనువ్వులతో“యమాయ తర్పయామి తర్పయామి తర్పయామి ” అంటూ యమతర్పణం విడవాలి. ఈ రోజున నరకాసురుడు వధ జరిగినందున ఈ మంత్రం జపించాలి. అనంతరం యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ! వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ!! ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే! మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!! అని శ్లోకం చెబుతూ ఇంటిని ముగ్గులతో అలంకరించుకోవాలి.
ముగ్గులతో అలంకరించిన ఇంటిని భూత ప్రేత పిశాచాలు రావని నమ్మకం. అనంతరం ఇంటిల్లిపాది స్నానాదికాలు చేసి కొత్త బట్టలు ధరించి ఇంట్లో తమ పూజా గదిలో దేవతామూర్తులకు పూజలు చేసి.. దీపం వెలిగించాయి. సాయంత్రం లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి ఇంటి చుట్టూ దీపాలు వెలిగించి మిఠాయిలు తింటారు. చిన్నారులతో బాణాసంచా కాలుస్తూ సంబరంగా పండుగను జరుపుకుంటారు.
ఇవి కూడా చదవండి:
Reinstated Gold Foils: శబరిమల ఆలయానికి కొత్త ప్రధాన అర్చకుడు
Defense Minister Rajnath Singh: పాక్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలోనే