Share News

Trump Effigy-Marbat: ట్రంప్‌పై నిరసన..నాగ్‌పూర్‌లో భారీ దిష్టిబొమ్మ ప్రదర్శన

ABN , Publish Date - Aug 24 , 2025 | 10:58 AM

నాగ్‌పూర్‌లో జరుగుతున్న మార్బత్ పండగ.. ట్రంప్ సుంకాలపై నిరసనలకు వేదికైంది. స్థానికులు ట్రంప్ దిష్టిబొమ్మను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

Trump Effigy-Marbat: ట్రంప్‌పై నిరసన..నాగ్‌పూర్‌లో భారీ దిష్టిబొమ్మ ప్రదర్శన
Nagpur Marbat festival-Trump

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో మార్బత్ పండగ సందర్భంగా ట్రంప్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. అనేక మంది ట్రంప్ దిష్టిబొమ్మను ఊరేగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. భారత వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపేందుకు స్థానికులు ఈ పండగను వేదికగా ఎంచుకున్నారు.

మట్టి, గడ్డితో ఈ దిష్టిబొమ్మను చేసి ఎర్ర కోటును తొడిగారు. రకరకాల పూల దండలను కూడా దిష్టిబొమ్మకు వేసి డప్పుల చప్పుళ్ల మధ్య ఊరేగించారు. స్థానికులు వినూత్న శైలిలో తమ నిరసనలు తెలియజేశారు. ‘టారిఫ్‌లతో మమ్మల్ని బెదిరిస్తే.. భారత్ దెబ్బకు మీకు కన్నీళ్లు తప్పవు’ అని ఓ స్థానికుడు ప్లకార్డు ప్రదర్శించాడు. మా పై సుంకాలు మీకే చేటు అని రాసున్న ప్లకార్డును మరో వ్యక్తి ప్రదర్శించాడు. మరికొందరు అమెరికా ద్వంద్వ వైఖరినీ ఎండగట్టారు. రష్యా వస్తువులు కొంటున్న అమెరికాకు భారత్‌పై అక్కసు ఎందుకని ప్రశ్నించారు.


ఏటా జరుపుకునే ఈ పండగకు పెద్ద చరిత్రే ఉందని స్థానికులు చెబుతున్నారు. 1800 దశాబ్దం చివర్లో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. అప్పట్లో స్థానికులు దుష్టశక్తులను పారద్రోలేందుకు దిషి బొమ్మలను ఊరేగించారు. కాలక్రమంలో ఈ పండుగ కొత్త సోబగులు సొంతం చేసుకుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికగా మారింది. హాస్య చతురతను, సెటైర్‌ను జోడించి జనాలను ఆకట్టుకునేలా ప్లకార్డులు, దిష్టి బొమ్మలను ప్రదర్శించడం ప్రారంభించారు. వినూత్న శైలిలో నిరసనలకు కూడా ఇది వేదికగా మారింది.

వాణిజ్య లోటు పూడ్చుకోవడంలో భాగంగా ట్రంప్ తొలుత భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. అమెరికా అభ్యంతరాలను కాదని రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు శిక్షగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్టు ఆ తరువాత ప్రకటించారు. దీంతో, భారత్‌పై మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి.


ఇవి కూడా చదవండి:

టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ఫాస్టాగ్ పాస్ ఉందా.. ఈ హైవేలపై మాత్రం పాస్ చెల్లదు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 11:06 AM