Maharashtra: అప్పుడు అందరికీ బట్టతల వైరస్.. ఇప్పుడు ఇంకోటి.. వరస మిస్టరీ వైరస్‌లకు కారణమేంటి..
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:04 PM
Buldhana Nail Loss After Baldness: ఆ నాలుగు గ్రామాలపై వరసగా వింత వైరస్‌లు దాడి చేస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఒకేసారి అందరికీ బట్టతల వైరస్ సోకి జుట్టు ఊడిపోతే.. ఈ సారి గోళ్లు రాలిపోతున్నాయి. ఈ విచిత్రమైన పరిస్థితులు తమకే ఎదురవుతుండటంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంతకీ, ఈ మిస్టరీ వైరస్‌లు ఆ గ్రామాలనే ఎందుకు పీడిస్తున్నాయి. ఇదేమైనా శాపమా.. ఇంకేదైనా కారణముందా..
Buldhana Mysterious Nail Loss: ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. అప్పుడేమో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ 'బట్టతల వైరస్'సోకి ఒత్తైన పొడవాటి జుట్టు మొత్తం రాలిపోయి గుండు అయింది. ఇంకా ఆ విషాదం నుంచి ప్రజలు తేరుకోకముందే అకస్మాత్తుగా గోళ్లు చివరికంటా రాలడం ప్రారంభించాయి. ఇలా వరసపెట్టి వింత వైరస్‌లు ఆ గ్రామప్రజలపైనే ఎందుకు దాడి చేస్తున్నాయి. డాక్టర్లకు సైతం పరీక్ష పెడుతున్న ఈ విచిత్రమైన పరిస్థితుల వెనకగల అసలు కారణమేంటి.. ఈ కథనంలో తెలుసుకుందాం..
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలోని ఆ 4 గ్రామాల్లో వింత వ్యాధులు ప్రబలుతున్నాయి. కొన్నాళ్ల కిందటే ఈ ఊళ్లల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ 'బట్టతల వైరస్' సోకి ఉన్నపళంగా జుట్టంతా రాలిపోయింది. ఒక వ్యక్తికైతే ఏకంగా వారం రోజుల్లోనే బట్టతల వచ్చేసింది. షెగావ్ తహసీల్ పరిధిలోని బోండ్‌గావ్, ఖట్ఖేర్, భోంగావ్ చెందిన దాదాపు 300 మంది గ్రామస్తుల ఫిర్యాదుతో ఈ ఆందోళనకరమైన పరిస్థితి మొదట డిసెంబర్ 2024లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ వింత వైరస్ గురించి ఇంకా స్థానికులు మర్చిపోకముందే.. నాలుగైదు నెలలుగా మరో కొత్త వైరస్ కలవరపెడుతోంది. ఇక్కడి ప్రాంతాల్లో నివసించే చాలామంది గోర్లు గుల్లబారిపోవడం, పూర్తిగా రాలిపోవడం వంటి సమస్యలతో సతమవుతున్నారు.

ఆ గ్రామాల్లోనే ఎందుకీ వింత వ్యాధులు
ఈ సమస్యను గ్రామ సర్పంచులు ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వైద్య పరీక్షలు ప్రారంభించారు. నాలుగు గ్రామాల నుంచి గోళ్ల వైకల్యానికి గురైన 29 మంది వ్యక్తుల నుంచి రక్తనమూనా సేకరించారు. పరీక్షల అనంతరం బుల్దానా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిల్ బంకర్ ఈ వైరస్ తీవ్రతను ధృవీకరించారు. కొంతమందికి గోళ్లు పూర్తిగా లోలోతుల నుంచి ఊడిపోయాయి. ప్రాథమిక పరిశోధనల ప్రకారం సెలీనియం స్థాయి పెరగడం వల్ల గోళ్లు, జుట్టు రాలడానికి కారణమని తెలిపారు. వైద్య నిపుణులు ఈ స్థితిని "అక్యూట్ ఆన్సెట్ అలోపేసియా టోటాలిస్" అని పేర్కొంటున్నారు. బుల్ధానాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హిమ్మత్రావ్ బవాస్కర్, పంజాబ్, హర్యానా నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఆ గ్రామాలకు సరఫరా చేసే గోధుమలలో స్థానికంగా పండించే రకాల కంటే 600 రెట్లు ఎక్కువ సెలీనియం స్థాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ కారణంగానే వారికీ దుస్థితి వచ్చిందని భావిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: మనిషి కాదు మృగం.. 11 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా..
EPS: తేల్చేశారు.. ఆ పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వబోం..
BJP: ‘కాబోయే ముఖ్యమంత్రి నయినార్ నాగ్రేందన్’