Aircraft Crash: ఎల్‌వోసీ సమీపంలో కూలిన విమానం
ABN , Publish Date - May 08 , 2025 | 03:16 AM
ఆపరేషన్ సిందూర్ అనంతరం పుల్వామాలో విమానం కూలిన ఘటన కలకలం రేపింది. విమానానికి భారత్ లేదా పాక్ సంబంధమో స్పష్టత లేకపోయినా, రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
కశ్మీరులోని పుల్వామా జిల్లా వయున్‌లో ఘటన
అది ఎవరి విమానమనే సందేహాలు
ఎలాంటి ప్రకటనా చేయని భారత్, పాక్
శ్రీనగర్, మే 7: జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా పాంపోర్ సమీపంలో బుధవారం ఉదయం ఓ విమా నం కూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన నేపథ్యంలో విమానం కూలడం గమనార్హం. ఆ విమానం ఎవరిదనే విషయంలో స్పష్టత లేదు. భారత్ కానీ, పాకిస్థాన్ కానీ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే భారత్‌కు చెందిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ గగనతల లక్ష్యాలను ఛేదిస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. విమానం కూలిన ఘటనలో ఆకాశ్ క్షిపణి పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం కూలిన వయున్ ప్రాంతం ఎల్‌వోసీకి సమీపంలో ఉంది. అక్కడ భారత్, పాక్ సైనిక కార్యకలాపాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఘటనపై స్థానిక కశ్మీరీలు 19 నిమిషాల నిడివి గల ఓ వీడియోను చూపుతున్నారు. అందులో మంటల్లో చిక్కుకున్న విమాన శకలాలు కనిపించాయి. అందు లో 14వ నిమిషం వద్ద ‘మేడిన్ ఇండియా’ విమానం అన్న మాటలు ఉండడంతో అది భారత్‌కు చెందిన విమానమేనన్న ఊహాగానాలు వినిపించాయి. మరోవైపు కూలిన విమానం పాకిస్థాన్‌కు చెందిన జేఎఫ్-17 లేదా ఎఫ్-16 అని, భారత బలగాలు కూల్చివేశాయని కొందరు నెటిజన్లు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. మరికొందరు అది భారత విమానమని, పాక్ దాన్ని కూల్చేసిందని పోస్ట్‌లు పెట్టారు. అఖ్నూర్, రాంబన్‌లలో కూడా రెండు విమానాలు కూలాయన్న వార్తలు వచ్చాయి. మూడు భారత విమానాలను కూల్చామన్న పాక్ ప్రకటనల నేపథ్యంలో ఈ వార్తలు వచ్చాయి. కానీ, వీటిని ఎవరూ నిర్ధారించలేదు. ఐడీఆర్‌డబ్ల్యూ వెబ్‌సైట్ ఏఎ్‌ఫఐని ఉటంకిస్తూ కథనం ప్రచురించింది.
ఆకాశ్ పాత్ర ఉందా?
ఊహాగానాలకు బలం చేకూర్చేలా మరో వీడియో తెరపైకి వచ్చింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి ఆకాశ్ క్షిపణిని ప్రయోగించినట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. శత్రువుల విమానాలు, డ్రోన్లను (45 కి.మీ. దూరం వరకు) గగనతలంలోనే కూల్చివేసేలా దీన్ని రూపొందించారు. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆకాశ్ క్షిపణి వ్యవస్థను ఎల్‌వోసీ వెంట మోహరించారు. ఈ క్షిపణి ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగలదు. పాంపోర్‌లో విమానం కూల్చివేసిన ఘటనలో ఈ క్షిపణి ప్రమేయం ఉందా? లేదా? అన్న విషయంలో స్పష్టత రాలేదు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత గగనతల రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేశారన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News