Jaish Women Brigade: భారత్ టార్గెట్‌గా మహిళా ఉగ్రవాదుల బృందం.. పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ కొత్త వ్యూహం
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:20 PM
పాక్ ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉగ్రవాదులతో ఆత్మాహుతి దాడులు చేయించేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలను చేర్చుకునేందుకు పాక్‌తో పాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్‌లకు యత్నిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు ఛిన్నాభిన్నమైన పాక్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మహ్మద్ కొత్త పన్నాగానికి తెర తీసింది. ఉగ్రకార్యకలాపాల్లో తొలిసారిగా మహిళలను రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. ఐసీస్, బోకో హారమ్, హమాస్, ఎల్‌టీటీఈ వంటి సంస్థలు మహిళా ఉగ్రవాదులను ఆత్మాహుతి దాడులకు ఉపయోగిస్తాయి. అయితే, లష్కర్ ఏ తయ్యబాతో పాటు జైష్ మాత్రం మహిళలను యుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతాయి. కానీ జైష్ తాజాగా తన పంథాను మార్చుకుంది. ఉగ్ర కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు మహిళలనూ రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. ఇందుకు జైష్ అధినేత మసూద్ అజర్, అతడి సోదరు తల్హా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు (Jaish's Women Terrorist Wing).
ఈ మహిళ ఉగ్రమూకల బృందానికి జమాత్ ఉల్ మోమినత్ పేరును ఖరారు చేశారు. ఈ దళాలినికి జైష్ అధినేత మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నేతృత్వం వహిస్తోంది. ఈ బృందంలో ఇప్పటికే జైషే ఉగ్రవాదుల భార్యలను చేర్చుకుంది. వీరితో ఆత్మాహుతి దాడులు చేయించేందుకు తర్ఫీదునిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత దళాలు.. జైష్ ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడిలో సాదియా భర్త మరణించాడు (Jamaat-ul-Mominaat).
ఆర్థికంగా, సామాజికంగా బలహీన స్థితిలో ఉన్న మహిళలను జైష్ ఈ బృందంలో చేర్చుకుంటోంది. బహావల్‌పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరీపూర్, మాన్సేరా ప్రాంతాల్లోని తన కేంద్రాల్లో మహిళలను రిక్రూట్ చేసుకుంటోంది. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా రిక్రూట్‌మెంట్ చేసుకునేందుకు ట్రై చేస్తోంది. భారత్‌లో కూడా జమాత్ ఉల్ మోమినత్ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమైన జైష్.. ఆన్‌లైన్ వేదికల ద్వారా జమ్మూకశ్మీర్, యూపీలో తన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలను కూడా జైష్ టార్గెట్ చేసింది. మతం పేరిట నగరాల్లోని విద్యావంతులైన మహిళను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించేలా మక్కా, మదీనాల ఫొటోలతో కూడిన సర్క్యులర్‌లను జారీ చేసింది (JeM Terrorists Sucide Bombers).
ఇక ఆపరేషన్ సిందూర్ దాడుల్లో తమ కుటుంబంలోని పది మంది మరణించారని జైష్ అధిపతి మసూద్ గతంలో ప్రకటించాడు. తన సోదరి, ఆమె భర్త, మరో బంధువు, అతడి భార్య, మేనకోడలు, మరో ఐదుగురు చిన్నారులు మరణించినట్టు తెలిపారు. భారత్ 1994లో మసూద్‌ను అరెస్టు చేసినా ఆ తరువాత ఎయిర్ ఇండియా ఐసీ 814 విమానం హైజాక్ నేపథ్యంలో అతడిని విడిచిపెట్టాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
కన్ఫర్మ్‌డ్ టిక్కెట్లల్లో ప్రయాణ తేదీ మార్పుకు ఛాన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
ప్రయాణికులకు శుభవార్త.. దీపావళి, ఛట్ పూజ సందర్భంగా 12000 ప్రత్యేక రైళ్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి