Share News

Maoists: భారత్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపు..

ABN , Publish Date - Nov 21 , 2025 | 01:50 PM

మావోయిస్టు పార్టీ మరోసారి భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టుల మృతికి నిరసనగా ఈ బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు వివరించింది.

Maoists: భారత్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపు..

న్యూఢిల్లీ, నవంబర్ 21: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆ పార్టీ అగ్రనేత హిడ్మాతోపాటు పలువురిని పోలీసులు క్రూరంగా హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారంటూ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అందుకు నిరసనగా నవంబర్ 23వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట శుక్రవారం లేఖ విడుదల చేశారు. పోలీసుల చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు.


నవంబర్ 18వ తేదీన ఉదయం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతం సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, ఆయన భార్య రాజేతోపాటు పలువురు మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలకు రంప చోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి తరలించారు. ఈ మృతదేహాలకు హిడ్మా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.


ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మేలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ.. జూన్ 10వ తేదీన భారత్ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మృతి చెందడంతో.. నవంబర్ 23వ తేదీ ఆదివారం భారత్ బంద్‌కు పార్టీ పిలుపునిచ్చింది.


2026, మార్చి నెలాఖారు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం విధితమే. మావోయిస్టులు లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధికి పాటుపడాలని కేంద్రం పిలుపునిచ్చింది. లేదంటే.. నిర్మూలనే పరిష్కారం అంటూ హెచ్చరించింది. కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌తో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే ఛత్తీస్‌గఢ్‌లో.. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఇప్పటికే వందలాది మంది ఎన్‌కౌంటర్లలో చనిపోవడం, మరికొందరు లొంగిపోవడంతో.. మావోల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మిగిలిన మావోయిస్టులను సైతం ఏరివేసేందుకు భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రతినబూనినట్లు వచ్చే ఏడాదిలోగా మావోయిస్టు పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్టుల అరెస్టులో కీలకాంశాలు

రాష్ట్రంలో అర్బన్‌ నక్సల్స్‌ జల్సాలు

For More National News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 03:52 PM