Minister Bandi Sanjay criticized urban Naxals: రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ జల్సాలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:58 AM
రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ నగరాల్లో ఉంటూ జల్సాలు చేస్తున్నారని, నామినేటెడ్ పదవులు దక్కించుకుని పైరవీలు చేసుకుంటూ రూ.కోట్లు దండుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. పేదల కోసమే పోరాటాలు చేస్తామని ప్రకటించుకునే వారు....
ప్రభుత్వంలో ఏం నచ్చిందని భాగస్వాములయ్యారు
నామినేటెడ్ పదవులతో రూ.కోట్లు దండుకుంటున్నారు: సంజయ్
హైదరాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ నగరాల్లో ఉంటూ జల్సాలు చేస్తున్నారని, నామినేటెడ్ పదవులు దక్కించుకుని పైరవీలు చేసుకుంటూ రూ.కోట్లు దండుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. పేదల కోసమే పోరాటాలు చేస్తామని ప్రకటించుకునే వారు, ఏం నచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు ఏ హామీని అమలు చేసిందని నిలదీశారు. ఏమాత్రం నైతికత ఉన్నా వారు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. అమాయక పిల్లలను పాటలు, మాటల ద్వారా రెచ్చగొట్టి.. తుపాకీ పట్టించడం ఏం సిద్ధాంతమని నిలదీశారు. తుపాకీ పట్టుకుని పది రోజులు అడవిలో తిరిగితే ఎలా ఉంటుందో అర్బన్ నక్సల్స్‌కు తెలుస్తుందని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం ఇచ్చే రివార్డుతో నిజాయితీగా ఉంటున్నారని..అర్బన్ నక్సల్స్ మాత్రం రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఏమైనా అంటే సుందరయ్య విజ్ణాన కేంద్రంలో మీటింగ్‌లు పెట్టి, ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తారని విమర్శించారు.
కేటీఆర్ విచారణపై సీఎం స్పందించాలి..
ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిచ్చిన నేపథ్యంలో.. సీఎం రేవంత్ స్పందించాలని సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని, అవినీతి సొమ్మును కక్కిస్తానని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారని గుర్తుచేశారు. జైలుకు పంపడం సంగతేమోగానీ, కనీసం వారిని టచ్ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు.
ఈటలతో విభేదాలు లేవు..
ఎంపీ ఈటల రాజేందర్‌కు, తనకు మధ్య విభేదాలు లేవని సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, ఏనాడూ ముస్లింలను కించపరచలేదని తెలిపారు. కాగా, దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన దేవుడిని నమ్మేవిధంగా దేవుడి కరుణ ఉండాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.