Manda krishna Madiga: జస్టిస్ గవాయ్‌పై దాడి.. నిందితుడిపై నేటికి కేసు నమోదు కాలేదు: మంద కృష్ణ మాదిగ
ABN , Publish Date - Nov 16 , 2025 | 03:59 PM
బాంబు పేలుళ్ల తర్వాత సైతం ఢిల్లీలో ధర్నాలకు అనుమతి ఇచ్చారని మంద కృష్ణమాదిగ గుర్తు చేశారు. చివరకు ఈ రోజు ఆదివారం సైతం ఢిల్లీలో ధర్నాలకు పోలీసులు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 16: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి చేసిన నిందితుడిపై ఇప్పటికే వరకు కేసు నమోదు చేయలేదని పోలీసులపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఈ దాడి జరిగి నేటికి.. అంటే ఆదివారానికి 50 రోజులు అయిందన్నారు. ఈ అంశంలో మానవ హక్కుల సంఘం సైతం జోక్యం చేసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీజేఐకు మద్దతుగా సోమవారం జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్దంగా సభ నిర్వహించాలని భావించామన్నారు. కానీ ఈ సభకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారని అగ్రహం వ్యక్తం చేశారు. ఇది పౌర హక్కులను హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతియుతంగా ఈ సభను నిర్వహించాలని అనుకున్నామని.. ఈ ధర్నాకు అనుమతించాలని నవంబర్ 7వ తేదీన పోలీసులకు లేఖ సైతం అందించామన్నారు.
సీజేఐకి సంఘీభావంగా సభ నిర్వహించుకుంటామంటే.. అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. అయితే అనుమతి లేకుండా ధర్నా చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ తాము అనుమతి తీసుకున్నామన్నారు. తాము అడిగింది కూడా కేవలం మూడు గంటలు మాత్రమేనని ఈ సందర్భంగా మందకృష్ణ వివరించారు. కానీ పోలీసులు అనుమతులను నిరాకరించారని.. ఇది పౌర హక్కులను కాలరాయడంతోపాటు స్వేచ్ఛను హరించడమేనన్నారు. ఇది దళితులుకు మాత్రమే వర్తిస్తుందా? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి దళితుల ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగా తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా దీనిని అభివర్ణిస్తున్నామని పేర్కొన్నారు.
న్యాయ వ్యవస్థకు బాస్ సుప్రీంకోర్టు అని స్పష్టం చేశారు. సీజేఐ దళితుడు కాబట్టే దాడి చేశారని విమర్శించారు. రేపటి ధర్నా కోసం ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి దళిత సంఘాలు ఢిల్లీకి బయలుదేేరాయన్నారు. వారంతా ప్రస్తుతం మార్గ మధ్యలో ఉన్నారని వివరించారు. ఇప్పుడు వారంతా ఎలా వెను దిరిగి వెళ్తారని ప్రశ్నించారు.
బాంబు పేలుళ్ల తర్వాత సైతం ఢిల్లీలో ధర్నాలకు అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. చివరకు ఈ రోజు ఆదివారం సైతం ఢిల్లీలో ధర్నాలకు పోలీసులు అనుమతి ఇచ్చారన్నారు. ఢిల్లీ వారు ధర్నా చేస్తే అనుమతి ఇస్తారు. కానీ హైదరాబాద్, ఇతర ప్రాంతాల వారు ధర్నా చేసేందుకు మాత్రం అనుమతి ఇవ్వరా? అంటూ ఢిల్లీ పోలీసుల వ్యవహార శైలిపై మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అందుకే దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కావాలని ఆకాంక్షించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైదరాబాదు రెండో రాజధాని అయితే అక్కడే తాము ధర్నా చేసే వాళ్ళమన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ ఢిల్లీ పోలీసులను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఉత్తరాదికి ఒక న్యాయం, దక్షిణాదికి ఒక న్యాయం ఉండవద్దంటూ ఈ సందర్భంగా పోలీసులకు మంద కృష్ణమాదిగ హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుటుంబంలో కలహాలు తొలగాలంటే.. ఈ రోజు..
మాస్టార్‌ని ఆకాశానికెత్తిన నారా లోకేష్
For More National News And Telugu News