Countdown to GST Rate Changes: కౌంట్‌డౌన్..
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:25 AM
జీఎస్టీ శ్లాబుల కుదింపు, చాలా రకాల వస్తువుల పన్నుల్లో మార్పుతో లబ్ధి ఎంత? పన్ను తగ్గిన వస్తువుల ధరలు నేరుగా అంత శాతం తగ్గుతాయా...
జీఎస్టీ కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చే 22వ తేదీపై అందరి దృష్టి
టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లపై రూ.1,500 నుంచి 45 వేల వరకు తగ్గే చాన్స్
13 శాతం వరకు తగ్గనున్న ఐస్‌క్రీమ్‌ల ధరలు
ద్విచక్ర వాహనాలపై 25 వేల వరకు మిగులు
జిమ్‌లు, సెలూన్లపై పన్ను 5 శాతానికి తగ్గింపు
రూ.100లోపు సినిమా టికెట్లపై తగ్గిన పన్ను
స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ కాస్త భారం
ఐపీఎల్ టికెట్లపై 40 శాతం పన్ను మోత
బిజినెస్, ఫస్ట్ క్లాస్ టికెట్లు మరింత ప్రియం
జీఎస్టీ శ్లాబుల కుదింపు, చాలా రకాల వస్తువుల పన్నుల్లో మార్పుతో లబ్ధి ఎంత? పన్ను తగ్గిన వస్తువుల ధరలు నేరుగా అంత శాతం తగ్గుతాయా? ఇతర అంశాల ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏయే వస్తువుల రేట్లు ఎంత వరకు తగ్గుతాయి? టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ వంటివాటి నుంచి కార్లు, బైకుల దాకా ఏది కొంటే ఎంత ఆదా అవుతుంది? ఎవరెవరికి, ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ.. కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చే సెప్టెంబరు 22 పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కొత్తగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ గృహోపకరణాలు కొనుగోలు చేయాలని భావించే వారంతా ఇప్పుడు కొనేకంటే.. 22వ తేదీ తర్వాత కొంటే ఎంత మిగులుతుందనే అంచనాలు వేసుకుంటున్నారు.

చక్కెర కలిపితే ‘ధర’ చేదు!
సహజ, కృత్రిమ చక్కెరలు కలిపిన శీతల పానీయాలు, కృత్రిమ పళ్ల రసాలు, ఇతర పానీయాలను ‘హానికర’ పదార్థాల కేటగిరీతోపాటు 40శాతం ప్రత్యేక పన్ను రేటులో చేర్చడం గమనార్హం. దీనితో శీతల పానీయాలు, ఐస్ టీలు, కెఫీన్ కలిపిన పానీయాలు, ఎనర్జీ డ్రింకులు వంటివాటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే కారణంతో కారమెల్ తీపి పదార్థం కలిపిన పాప్‌కార్న్‌ను కూడా 18శాతం పన్ను రేటులో కొనసాగించారు. సాధారణ పాప్‌కార్న్‌పై 5శాతమే పన్ను వేశారు. మరోవైపు చక్కెర కలిపేవే అయినా.. పళ్ల రసాలు, పాల ఆధారిత పానీయాలు, ఐస్ క్రీమ్, పేస్ట్రీలు, సంప్రదాయ మిఠాయిలపై పన్ను రేటును 5శాతానికే పరిమితం చేశారు.

బీడీలు చవక.. సిగరెట్లపై మోత!
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను 40 శాతం ప్రత్యేక పన్ను రేటులోకి చేర్చిన జీఎస్టీ కౌన్సిల్.. బీడీలను మాత్రం 28శాతం నుంచి 18శాతం పన్నురేటుకు మార్చింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. బీడీల ధరలు మాత్రం తగ్గే అవకాశం ఉంది. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది బీడీల తయారీపై ఆధారపడి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఐస్‌క్రీమ్‌లు మరింత తీపి..
పాలు, పాల ఉత్పత్తులపై వసూలు చేస్తోన్న జీఎస్టీ అంశం లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఐస్‌క్రీమ్‌ల ధరలు బాగా తగ్గనున్నాయి. ఉత్పత్తిదారు లేదా ఐస్‌క్రీమ్ పార్లర్లు, రిటైల్ దుకాణాల్లో విక్రయించే ఐస్‌క్రీములపై జీఎస్టీని 18ు నుంచి 5 శాతానికి తగ్గించారు. ఉదాహరణకు ఓ ఐస్‌క్రీమ్ ధర రూ.100 అయితే 18 శాతం జీఎస్టీ కలిపి రూ.118 అయ్యేది. ఇప్పుడు రూ.105కు తగ్గుతుంది. ఇక నెయ్యి, వెన్న, చీజ్ వంటి వాటిపై ప్రస్తుతం 12ు ఉన్న పన్నును ఐదు శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయాలు వినియోగదారులతోపాటు పాడి రైతులకు, డెయిరీ పరిశ్రమకు లబ్ధి చేకూరుస్తాయని కేంద్రం ప్రకటించింది. వెన్న, నెయ్యి, పాలు విక్రయానికి వాడే ఇనుము, స్టీల్, అల్యూమినియం డబ్బాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించడం కూడా డెయిరీ రంగానికి ఊరటనిచ్చే అంశమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

తగ్గనున్న హోటల్ గదుల అద్దెల భారం.. పర్యాటకానికి ఊతం
రోజుకు రూ.7,500లోపు అద్దె ఉండే హోటల్ గదులపై జీఎస్టీని ప్రభుత్వం 5 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం పర్యాటక రంగానికి ఊతమిస్తుందనే హర్షం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం రూ.వెయ్యి- 7,500 లోపు అద్దె గదులపై 12ు జీఎస్టీ ఉంది. తాజా తగ్గింపుతో పర్యాటకులపై అద్దె భారం తగ్గనుంది. ప్రస్తుతం రూ.6వేలు అద్దె అయితే 12ు జీఎస్టీ కలిపి రూ.6,720 చెల్లించాలి. అదే సెప్టెంబరు 22 నుంచి రూ.6,300 చెల్లిస్తే చాలు. కాగా, సెప్టెంబరు 22నుంచి రూ.7500 పైబడిన అద్దె ఉండే గదులను 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి.

బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు మరింత ప్రియం
ఈ నెల 22 నుంచి విమానాల్లో ఎకానమీ మినహా బిజినెస్, ఫస్ట్ క్లాస్ టికెట్ల ధరలు పెరగనున్నాయి. ఎకాన మీ టికెట్లపై జీఎస్టీ 5ు మార్చలేదు. బిజినెస్, ఫస్ట్ క్లాస్ టికెట్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. ఫలితంగా విమానాల్లో సౌకర్యవంతంగా, విలాసవంతంగా ప్రయాణించాలంటే మరింత డబ్బు చెల్లించాల్సిందే. అయితే, ధరలు పెరిగితే ఎకానమీ క్లాస్ టికెట్లకు డిమాండ్ పెరుగుతుందని విమానయాన రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పాప్‌కార్న్ ఓకే.. ‘కారమెల్’కు ఎఫెక్ట్
పాప్‌కార్న్‌పై ఇటీవలి వరకు ఉన్న విమర్శలకు తాజాగా చెక్ పడింది. ఇంతకుముందు పాప్‌కార్న్ విడిగా అమ్మితే 5ు, ప్యాక్ చేస్తే 12ు, కారమెల్ (తీపి) ఫ్లేవర్ కలిపితే 18ు పన్ను ఉండేది. ఇకపై విడిగా, ప్యాక్ చేసినా 5శాతమే పన్ను ఉంటుంది. కారమెల్‌పై మాత్రం 18ు పన్ను కొనసాగుతుంది.

ఫిట్‌నె్‌సకు, అందానికి ఖర్చు తగ్గినట్టే!
జిమ్‌లు, యోగా కేంద్రాలు, హెల్త్ క్లబ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, సెలూన్లు, బార్బర్లు తదితర సేవలపై ఇప్పటివరకు 18శాతం పన్ను ఉండగా.. ఇప్పుడు 5శాతానికి తగ్గించారు. దీనితో ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం, అందం కోసం చేసే ఖర్చు కాస్త తగ్గనుంది.

ఫుడ్ డెలివరీ మరికొంత భారం!
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీతోపాటు బ్లింక్ ఇట్, స్విగ్గీ ఇన్‌స్టా వంటి గ్రోసరీ డెలివరీ సేవలపై కొత్తగా 18ు జీఎస్టీ విధించారు. డెలివరీ చార్జీలపై ఈ పన్ను వర్తిస్తుంది. ప్రస్తుతం ఒక్కో జొమాటో ఆర్డర్‌పై రూ.2, స్విగ్గీ ఆర్డర్‌పై రూ.2.6, ఇన్‌స్టామార్ట్ ఆర్డర్‌పై రూ.1 వరకు భారం పడుతుంది.

రూ.100లోపు సినిమా టికెట్లపై తగ్గిన పన్ను
సినిమా థియేటర్లలో రూ.100 లోపు ధర ఉండే టికెట్లపై పన్నును 12ు నుంచి 5ుకు తగ్గించారు. అంటే సింగిల్ స్ర్కీన్ థియేటర్లకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లలో టికెట్ రేట్లకు ఉపశమనం ఎక్కువగా ఉండనుంది.

ఐపీఎల్ టికెట్లపై పన్ను మోత
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు, ఇతర గుర్తింపు లేని క్రీడా కార్యక్రమాల టికెట్లపై జీఎస్టీని 28ు నుంచి 40 శాతం ప్రత్యేక పన్నురేటులోకి మార్చారు. దీని తో వాటి టికెట్ల ధరలు బాగా పెరుగుతాయి. ఉదాహరణకు రూ.1000 ఐపీఎల్ టికెట్‌పై పన్ను కలిపి రూ.1,400 అవుతుంది. ప్రత్యేకంగా గుర్తించిన క్రీడా కార్యక్రమాలకు 18ు జీఎస్టీ కొనసాగనుంది.

రాష్ట్రపతి బీఎండబ్ల్యూ కారుకు జీఎస్టీ మినహాయింపు
కేంద్రం రాష్ట్రపతి కోసం కొనుగోలు చేస్తున్న బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారుకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. దీని విలువ సుమారు రూ.3.66 కోట్లు. అత్యాధునిక భద్రత సదుపాయాలు ఉన్న ఈ కారును రాష్ట్రపతి భద్రత కోసం కొనుగోలు చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది. రాష్ట్రపతి ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ ఎస్600 పుల్‌మన్ లిమోజిన్ వాడుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి