New Gaming Bill: మూతపడ్డ ఆన్‌లైన్ మనీ గేమింగ్ యాప్స్
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:09 AM
డ్రీమ్11, మై11సర్కిల్, విన్‌జో, జూపీ, పోకర్‌బాజీ వంటి పలు ప్రముఖ సంస్థలు తమ ఆన్‌లైన్ మనీ గేమింగ్ సర్వీసులను నిలిపివేశాయి. ..
న్యూఢిల్లీ, ఆగస్టు 22: డ్రీమ్11, మై11సర్కిల్, విన్‌జో, జూపీ, పోకర్‌బాజీ వంటి పలు ప్రముఖ సంస్థలు తమ ఆన్‌లైన్ మనీ గేమింగ్ సర్వీసులను నిలిపివేశాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండానే వాటిని నిలిపివేయడం గమనార్హం. నిజమైన డబ్బుతో ఆడే అన్ని రకాల గేమింగ్ సేవలనూ తమ ప్లాట్‌ఫామ్‌పై నిలిపివేసినట్టు.. మై11సర్కిల్ ఆన్‌లైన్ ఫాంటసీ గేమును నిర్వహించే ‘ప్లేగేమ్స్ 24/7 ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్లు ధోనీ, రోహిత్ శర్మ, బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ వంటివారు ప్రమోట్ చేసిన డ్రీమ్11 సేవలను కూడా ‘ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్, 2025’ ఆమోదం పొందిన నేపథ్యంలో నిలిపివేసినట్టు ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. తమ యాప్‌లో ఉన్న వినియోగదారుల సొమ్ము సురక్షితంగా ఉందని, యూజర్లు తమ సొమ్మును ఉపసంహరించుకోవచ్చని పోకర్‌బాజీ సంస్థ ‘ఎక్స్’ పోస్టు ద్వారా తెలిపింది.
‘గేమింగ్ బిల్లు’కు రాష్ట్రపతి ముర్ము ఆమోదం
ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లను నిషేధిస్తూ కేంద్రం రూపొందించిన ‘గేమింగ్ బిల్లు’కు రాష్ట్రపతి ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. దీంతో, ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం.. నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తే నిర్వాహకులకు 3సంవత్సరాల జైలు, రూ.కోటి జరిమానా విధించనున్నారు. యాప్‌ల కోసం ప్రచారం చేసేవాళ్లకు కూడా రెండేళ్ల జైలు, రూ.50లక్షల జరిమానా విధిస్తారు. మరోవైపు, ఆదాయ పన్ను(ఐటీ) చట్టం-1961కి సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును కూడా రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించారు. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది.
ఇవి కూడా చదవండి..
చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు
వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్
For More National News And Telugu News