Maharashtra: మహారాష్ట్ర మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసు.. ఎస్సై అరెస్టు
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:05 AM
మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె సూసైడ్ నోట్‌లో ప్రస్తావించిన ఎస్సైని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో ప్రభుత్వ మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై గోపాల్ బదానేను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫల్టన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి బదానే లొంగిపోయారని సతారా ఎస్పీ తుషార్ దోషీ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ బాంకర్‌ను కూడా ఫల్టన్ పోలీసులు అరెస్టు చేశారు (Maharashtra woman doctor suicide SI Arrested).
సతారా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా చేస్తున్న బాధితురాలు గురువారం రాత్రి హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన చేతిపై సూసైడ్ లేఖ రాశారు. ఎస్సై బదానే తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఆరోపించారు. తనను బాంకర్ మానసికంగా వేధించాడని అన్నారు. బాంకర్ తండ్రి ఇంట్లోనే బాధితురాలు అద్దెకు ఉన్నారు. ఇక ఆత్మహత్యకు ముందు ఆమె బాంకర్‌తో మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది (Rape allegations on MH Cop).
మరోవైపు, మృతురాలి సూసైడ్ నోట్ వెలుగులోకి రాగానే పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తు అనంతరం, బదానేను సస్పెండ్ చేశారు. తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
బీడ్ జిల్లాల్లోని వాద్వానీ తెహ్సిల్‌లో శుక్రవారం మృతురాలి అంత్యక్రియలు జరిగాయి. ఆమె మరణానికి కారణమైన వారికి మరణ శిక్ష విధించాలని బంధువులు డిమాండ్ చేశారు. తనకు వేధింపులు ఎదురవుతున్నాయని ఆమె పలు మార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. మెడికల్ రిపోర్టులను తారుమారు చేయాలంటూ ఆమెపై ఒత్తిడిని తీసుకొచ్చారని కూడా అన్నారు. ఆమెను వేధించేందుకు ఆసుపత్రి యాజమాన్యం పోస్టుమార్టం డ్యూటీలు వేసిందని కూడా మండిపడ్డారు. ‘ఆమె తండ్రి ఓ రైతు. ఆయన పెద్దగా చదువుకోలేదు. నేను ఆమెను స్కూలుకు తీసుకెళ్లి తీసుకొచ్చేవాణ్ణి. ఆమె ఎమ్‌బీబీఎస్ తరువాత ఎండీ చేయాలని భావించింది. ఈఎన్‌టీ లేదా నాన్ క్లీనికల్ బ్రాంచెస్‌కు వెళదామని భావించింది’ అని మృతురాలి మేనమామ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఈ ఉదంతం రాజకీయ కలకలానికి కూడా దారి తీసింది. మెడికల్ రిపోర్టులు మార్చాలంటూ ఒత్తిడి తెచ్చిన ఎంపీని ఈ కేసులో నిందితుడిగా చేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ ధాస్ డిమాండ్ చేశారు. ఆ ఎంపీ ఎవరనేది మాత్రం ఆయన పేర్కొనలేదు.
ఇవి కూడా చదవండి:
ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్‌తో 1500 కోట్ల నష్టం.. హైదరాబాద్‌లో భారీగా బాధితులు!
విమానాల్లో పవర్‌బ్యాంకులతో ముప్పు.. కఠిన నిబంధనలు విధించే యోచనలో డీజీసీఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి