Home Ministry Report: ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్‌తో 1500 కోట్ల నష్టం.. హైదరాబాద్‌లో భారీగా బాధితులు!
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:29 PM
గత ఆరు నెలల్లో వెలుగు చూసిన ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్‌లో బాధితులు ఏకంగా 1500 కోట్ల మేర నష్టపోయినట్టు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లో బాధితులు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా గత ఆరు నెలల్లో భారీగా ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్ వెలుగులోకి వచ్చినట్టు హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 30 వేల మందికిపైగా బాధితులు ఏకంగా రూ.1500 కోట్ల మేర నష్టపోయినట్టు తేలింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఈ మోసాలు ఎక్కువగా వెలుగు చూశాయని పేర్కొంది. 65 శాతం కేసులు ఈ మూడు నగరాల్లోనే ఉన్నట్టు తెలిపింది. బాధితుల్లో 30 ఏళ్లు మొదలు 60 ఏళ్ల వయసున్న వారు ఉన్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ నివేదికను రూపొందించింది. (Investment Scams In India).
పెట్టుబడి పేరిట జరుగుతున్న ఈ స్కామ్‌ల కారణంగా బెంగళూరుకు అత్యధిక నష్టం జరిగింది. మొత్తం నష్టాల్లో బెంగళూరు వాటా ఏకంగా 26.38 శాతం. అమాయక ఇన్వెస్టర్లను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లకు ఈ నగరాలు ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారే ఎక్కువగా ఈ నేరాల బారిన పడుతున్నారు. బాధితుల్లో 76 శాతం మంది వయసు 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నట్టు ఈ నివేదికలో తేలింది. అధిక ఆదాయం పొందాలన్న బాధితుల తపనను నిందితులు ఆసరగా చేసుకుంటున్న వైనం ఈ గణాంకాల్లో కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. సీనియర్ సిజిజన్లు కూడా ఈ స్కామ్స్ బారిన పడుతున్నారు. వీరి వాటా 8.62 శాతంగా ఉంది. కొన్ని ఘటనల్లో బాధితులు సగటున రూ.51.38 లక్షల మేర నష్టపోయారు (Home Ministry Report).
తలసరి నష్టంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. అక్కడి బాధితులు సగటున రూ.8 లక్షలు నష్టపోయారు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా జరిగే మోసాల వాటా ఏకంగా 20 శాతంగా ఉంది. ఈ వేదికల్లోని ఎన్‌క్రిప్షన్ విధానం, సులువుగా గ్రూపులు క్రియేట్ చేసే వీలుడటం కారణంగా నేరగాళ్లు ఎక్కువగా వీటినే తమ స్కామ్స్ కోసం ఎంచుకుంటున్నారు. ఈ మోసాలకు లింక్డ్‌ఇన్, ట్విట్టర్ ఎక్కువగా వినియోగించకపోవడం మరో ఆసక్తికర అంశం. డైరెక్ట్ మేసేజీల ద్వారా నేరగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నట్టు ఈ నివేదికలో తేలింది.
ఇవి కూడా చదవండి:
విమానాల్లో పవర్‌బ్యాంకులతో ముప్పు.. కఠిన నిబంధనలు విధించే యోచనలో డీజీసీఏ
వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి