Kashmir Infiltration: కశ్మీర్‌లో చొరబాట్లకు యత్నం.. ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:21 AM
కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భద్రతా దళాలు మరోసారి భగ్నం చేశాయి. కుప్వారాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి సోమవారం మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని మచిల్, దుద్నియాల్ సెక్టర్‌లో చోరబాటు యత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి (Infiltration Bid Foiled in J and K).
మచ్చిల్ సెక్టర్‌లో నియంత్రణ రేఖకు సమీపంలో సోమవారం రాత్రి భద్రతా దళాలు ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించాయి. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ జరగ్గా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు (Two Terrorists Dead).
ఇక దుద్నియాల్ సెక్టర్‌లో పేలుళ్లు సంభవించడం ఆందోళనకు దారి తీసింది. దీంతో, భద్రతా దళాలు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టాయి. సరిహద్దు వెంబడి మళ్లీ చొరబాట్లకు ప్రయత్నాలు మొదలయ్యాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పటికే భద్రతా దళాలు అనుమానాస్పద ప్రాంతాల్లో ఉగ్రవాద ఏరివేత చర్యలు ప్రారంభించాయి. ఉగ్రవాదులకు సహకరిస్తున్న హ్యాండర్లు, సానుభూతిపరుల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసే పనిలో ఉన్నాయి. మరోవైపు, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు పాక్ ఉగ్రవాదులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, నగదును కశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాల్లో విడుస్తున్నారు. దీంతో, డ్రోన్ల ముప్పును తిప్పి కొట్టేందుకు సైన్యం.. డ్రోన్ విధ్వంసక వ్యవస్థలను సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసింది.
నియంత్రణ రేఖకు సమీపాన ఉన్న బారాముల్లా, కుప్వారా, బందీపొరా జిల్లాలో చొరబాట్లకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని స్థావరాల్లో దాక్కునే ఉగ్రవాదులు సమయం చూసి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తుంటారు. నిత్యం 100 మంది ఉగ్రవాదులు అదను చూసి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉంటారని అధికార వర్గాల అంచనా. దీంతో, భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి 24 గంటలు పహారా కాస్తూ పటిష్ఠ చర్యలను తీసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..
ఐఆర్‌సీటీసీ హోటల్స్ టెండర్స్ కేసు.. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి