Mallikarjun Kharge: వచ్చే జూన్‌లో రిటైర్ కానున్న ఖర్గే
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:17 AM
రాజ్యసభలో ఏకంగా 72 స్థానాలకు 2026 ఏప్రిల్, జూన్, నవంబరుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
దేవెగౌడ, దిగ్విజయ్‌తో పాటు కొందరు కేంద్ర మంత్రులు కూడా..
ఏపీ నుంచి నలుగురు.. తెలంగాణ నుంచి ఇద్దరు
న్యూఢిల్లీ, జూలై 13: రాజ్యసభలో ఏకంగా 72 స్థానాలకు 2026 ఏప్రిల్, జూన్, నవంబరుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. పలువురు కీలక నేతలు, కొందరు కేంద్ర మంత్రుల పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. వీరిలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (కర్ణాటక), కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రి జార్జి కురియన్ (మధ్యప్రదేశ్), కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టూ (రాజస్థాన్), జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ (జార్ఖండ్), కాంగ్రెస్ నేత శక్తిసింగ్ గోహిల్ (గుజరాత్), వైసీపీ ఎంపీలు పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ ఎంపీ సానా సతీశ్ (ఆంధ్రప్రదేశ్) కూడా జూన్‌లో రిటైర్ కానున్నారు. వీరికి ముందే ఏప్రిల్‌లో ఎన్‌సీపీ-ఎస్పీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (ఆర్‌పీఐ) సహా మహారాష్ట్ర నుంచి ఏడుగురు పదవీవిరమణ చేయనున్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ, బీఆర్‌ఎస్ కు చెందిన కేఆర్ సురేశ్‌రెడ్డి కూడా అదే నెలలో రిటైర్ కానున్నారు. మహారాష్ట్ర-7, తమిళనాడు-6, బెంగాల్-5, బిహార్-5, ఒడిసా-4, అసోం-3, తెలంగాణ-2, ఛత్తీస్‌గఢ్-2, హరియాణా-2, హిమాచల్ నుంచి ఒక్కరు చొప్పున ఏప్రిల్‌లో రిటైరవుతారు. ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, ఉత్తరాఖండ్ నుంచి ఒకరు నవంబరులో పదవీవిరమణ చేస్తారు.