Arvind Kejriwal: క్రిమినల్స్‌ను పార్టీలోకి చేర్చుకున్న వారికి ఎన్నేళ్లు జైలు పడాలి?
ABN , Publish Date - Aug 25 , 2025 | 06:40 PM
ప్రత్యర్థి పార్టీల్లోని ఫిరాయింపుదారులను బీజేపీలోకి తీసుకోవడాన్ని కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. వీరిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారేనని అన్నారు.
న్యూఢిల్లీ: తీవ్రమైన నేరాలతో అరెస్టయి 30 రోజులపాటు జైలులో ఉన్న ప్రధాని, సీఎం, మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించి పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఘాటుగా స్పందించారు. కుంభకోణాల్లో చిక్కుకున్న నేతలను బీజేపీలోకి చేర్చుకోవడాన్ని ప్రశ్నించారు. నేరస్థులను పార్టీలోకి తీసుకుని వారిని సీఎంలుగా, ప్రధానులుగా చేసిన వారికి ఎన్నేళ్లు జైలుశిక్ష పడాలని నిలదీశారు.
ప్రత్యర్థి పార్టీల్లోని ఫిరాయింపుదారులను బీజేపీలోకి తీసుకోవడాన్ని కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. వీరిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారేనని అన్నారు. 'తీవ్రమైన నేరాలున్న నేతలను పార్టీలోకి తీసుకుని, వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తున్నారు. వారిని మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు లేదా ముఖ్యమంత్రులను చేస్తున్నారు. అందుకు ప్రధానమంత్రి కానీ, మంత్రి కానీ రాజీనామా చేస్తారా?' అని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించి, ఆ తర్వాత అతను నిర్దోషిగా విడుదలైతే పరిస్థితి ఏమిటని అడిగారు. తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రికి ఎన్నేళ్లు జైలు పడాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
అమిత్‌షా ఏమన్నారు?
హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును సమర్ధించారు. రాజకీయాల్లో నైతికత అవసరమన్నారు. తీవ్రమైన కేసులో జైలులో ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి అక్కడి నుంచే పనిచేసేందుకు అనుమతిద్దామా? అని ప్రశ్నించారు. చిన్న చిన్న నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ముసాయిదా చట్టం వర్తించదని అన్నారు. అవినీతి లేదా ఇతర ఆరోపణలపై ఐదేళ్లకు పైగా జైలు పడిన వారు అక్కడి నుంచే పాలన సాగించడం సరైనదే అవుతుందా? అని నిలదీశారు. ఆ ఆలోచనను తాను, తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, అలా జరగకపోయి ఉంటే ఇప్పుడు బిల్లు వచ్చేది కాదని అమిత్‌షా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు... బలగాలు అప్రమత్తం
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News