Karur Stampede: కరూర్ తొక్కిసలాట.. టీవీకే నేత అరెస్ట్
ABN , Publish Date - Sep 30 , 2025 | 09:39 AM
టీవీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు మది అలగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు, సెప్టెంబర్ 30: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి టీవీకే పార్టీ జిల్లా అధ్యక్షుడు మది అలగన్‌ను (TVK Party District President Madi Alagan) అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 21 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే ఈ తొక్కిసలాట ఘటనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన యూట్యూబర్ ఫెలిక్స్ గెరాల్డ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా.. ఈనెల 27న రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో తమిళ వెట్రి కళగం (టీవీకే) భారీ ర్యాలీ నిర్వహించింది. టీవీకే అధ్యక్షుడు, ప్రముఖ నటుడు ఇళయ దళపతి విజయ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే ఈ ర్యాలీలో పెను విషాదం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావించిన విజయ్ ఈనెల 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈనెల 27న నమక్కల్‌లో ఉదయం ప్రచారం నిర్వహించి సాయంత్రం కరూర్ చేరుకున్నారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అలాగే మొత్తం 110 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 51 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
Read Latest National News And Telugu News