Chennai News: రగులుతున్న కరూర్..
ABN , Publish Date - Oct 01 , 2025 | 10:56 AM
ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన వ్యవహారం రాష్ట్రంలో ఇంకా నిప్పు రాజేస్తూనే వుంది. ఈ దుర్ఘటన ద్వారా లబ్ధి పొందేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతుండడంతో మరిన్ని కొత్త వివాదాలకు కారణమవుతోంది.
- విమర్శలు, ప్రతివిమర్శలు
- అరెస్టులు, ఆగ్రహావేశాలు
- ఇంకా చల్లారని తొక్కిసలాట పర్యవసానం
- వాస్తవాలు తెలుసుకుందాం రండి: విజయ్‌కి బీజేపీ ఎంపీల బృందం ఆహ్వానం
ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ కరూర్(Karoor) పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన వ్యవహారం రాష్ట్రంలో ఇంకా నిప్పు రాజేస్తూనే వుంది. ఈ దుర్ఘటన ద్వారా లబ్ధి పొందేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతుండడంతో మరిన్ని కొత్త వివాదాలకు కారణమవుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని టీవీకే ఆరోపిస్తుండగా, ఆ పార్టీ ఉద్దేశపూర్వక ఆలస్యమే అసలు కారణమని అధికార పార్టీ ఆరోపిస్తుంది. దీంతో విమర్శలు, ప్రతివిమర్శలు, ఘటనకు కారణమైన వారుగా భావిస్తున్న వ్యక్తుల అరెస్టులు, దీనిపై ఆగ్రహావేశాలతో యావత్ రాష్ట్రం ఒకరకమైన ఉక్కపోతకు గురవుతోంది. మరోవైపు ఈ ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏర్పాటు చేసిన ఎనిమిదిమంది ఎంపీల బృందం మంగళవారం కరూర్ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, మృతుల కుటుంబాలను ఓదార్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎప్పుడు ఏ కొత్త విషయం వెలుగులోకి వస్తుందోన్న ఉత్కంఠ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
- చెన్నై, ఆంధ్రజ్యోతి
టీవీకే నాయకులకు 14వ తేది వరకు రిమాండ్
కరూర్ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన టీవీకే కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మదియళగన్, పొన్‌రాజ్‌లకు 15 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కరూరు కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంలో ఏ పత్రాలనూ అంగీకరించలేమని, తన మనస్సాక్షి ఆధారంగా ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ముందస్తు బెయిలుకు బుస్సీ ఆనంద్, నిర్మల్ కుమార్
కరూర్ ఘటనలో ముందస్తు బెయిలు కోరుతూ టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నిర్మల్‌కుమార్ మద్రాసు హైకోర్టులో మంగళవారం పిటిషన్లు దాఖలుచేశారు. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనకూ, తమకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేగాక పోలీసుశాఖ తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించిందని, ప్రభుత్వ యంత్రాంగం తప్పులు దాచిపెట్టి, తమపై కేసు నమోదుచేసిందని ఆరోపించారు.

ప్రమాదానికి గురైన ఎంపీ హేమమాలిని కారు
కరూర్ దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులు తెలుసుకునేందుకు ఎంపీ హేమమాలిని నేతృత్వంలో 8 మంది ఎంపీల బృందం మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి కోయంబత్తూరు చేరుకుని, అక్కడి నుంచి కారులో ఘటనా స్థలికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఎంపీల కార్లు ఒకదానివెంట మరొకటి వెళ్తూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో హేమమాలిని ప్రయాణిస్తున్న కారు ముందు భాగం దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
అసత్య వార్తలు పోస్ట్ చేసిన ముగ్గురికి రిమాండ్
కరూర్ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య కథనాలు పోస్ట్ చేశారంటూ 25 మందిపై చెన్నై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదుచేశారు. వారిలో పెరుంబాక్కంకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సహాయం (38), టీవీకే సభ్యుడు మాంగాడుకు చెందిన శివనేశ్వరన్ (36), టీవీకే నాయకుడు ఆవడికి చెందిన శరత్‌కుమార్ (32)లను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి, మిగిలిన 22 మంది కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని చెన్నై కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 15 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చెంగల్పట్టు జైలుకు తరలించారు.
తాత్కాలికంగా ప్రచారం వాయిదా: టీవీకే
విజయ్ పర్యటన కోసం స్థలాలను ఎంపిక చేయాలంటూ పోలీసులకు వినతి పత్రాలను ఇవ్వడాన్ని వాయిదా వేసుకోవాలని టీవీకే నేతలకు విజ్ఞప్తి చేసింది. నిజానికి విజయ్ తదుపరి ప్రచారం ఈ నెల 4న వేలూరు, రాణీపేట జిల్లాల్లో జరగాల్సివుంది. ఇందుకోసం ఆయా జిల్లాల నేతలు పోలీసుల అనుమతి కోరుతూ లేఖలు ఇవ్వాల్సివుంది. అయితే ఆ వ్యవహారాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని టీవీకే సూచించింది.
ఆదవ్ అర్జునన్‌పై కేసు నమోదు...
‘విప్లవం సృష్టించాలంటూ’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీవీకే నిర్వాహకుడు ఆదవ్ అర్జునన్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. కరూరు విషాదం జరిగిన మూడు రోజుల తర్వాత ఆదవ్ అర్జున తన ఎక్స్ పేజీలో.... ‘రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కొడతారు... సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే అరెస్ట్ చేస్తారు. పోలీసులు పాలక వర్గానికి సేవకులుగా మారితే, వారిని సరిచేసే మార్గం యువత విప్లవం ద్వారానే సాధ్యం. ప్రస్తుత యువత కలసి అధికారులకు వ్యతిరేకంగా విప్లవం సృష్టించి చూపాలి. యువత తిరుగుబాటు చేయాలి. ఆ తిరుగుబాటు పాలన మార్పునకు, అధికార పాలకుల అంతానికి పునాది అవుతుంది. దెయ్యాల పాలనలో శవాలు పీక్కుతింటాయి’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో కొద్దిసేపటికి ఆయన తన పోస్ట్ తొలగించారు. ఈ వ్యవహారంలో ఆదవ్ ఆర్జునపై చెన్నై కేంద్ర నేరవిభాగం పోలీసులు కేసు నమోదు చేశారు.
యువకుల మృతి కన్నీరు తెప్పించింది
మంత్రి అన్బిల్ మహేష్
కరూర్ ఘటన సంభవించిన వెంటనే మంత్రిగా తాను ఆ ప్రాంతానికి వెళ్లడంపై పలువురు విమర్శిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ విచారం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి నాగపట్టణం నుంచి వస్తున్న సమయంలో తనకు కరూర్ విషాదం తెలిసిందని, రాత్రి 10 గంటలకు తాను కరూర్ చేరుకున్నానని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న అంతమంది విద్యార్థులను స్ట్రెచ్చర్‌పై తీసుకెళ్లడాన్ని చూసి స్టెక్చర్‌పై తీసుకెళ్తుండడాన్ని చూసి ఎవరికైనా మనసు ద్రవిస్తుందన్నారు.
వాస్తవాలు తెలియాలి: బీజేపీ
కరూర్ విషాదంపై ఎంపీల బృందంతో కలసి వాస్తవాలు తెలుసుకునేందుకు రావాలని టీవీకే అధినేత విజయ్ బీజేపీ ఆహ్వానించింది. ఘటనకు దారితీసిన పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకునేలా బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో 8 మంది ఎంపీల బృందం కరూర్ పర్యటిస్తోందని, ఈ బృందంతో విజయ్ మాట్లాడాలని బీజేపీ నేత ప్రసాద్ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. న్యాయం జరిగే వరకు బృందానికి మద్దతుగా ఉండాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు, పూర్తి వివరాలు సేకరించి మృతిచెందిన 41 మందికి న్యాయం జరిగేలా విజయ్ సహకరించాలన్నారు. ఈ ఘటనపై వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా విజయ్‌కు ఉందని తెలిపారు. అందువల్ల రాజకీయాలకు అతీతంగా, దేశ సంక్షేమం, ప్రజల భద్రత కల్పించేలా విజయ్ ఎంపీల బృందంతో కలసి పనిచేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !
Read Latest Telangana News and National News