Karnataka High Court: జయలలిత వారసురాలి పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Jan 14 , 2025 | 05:14 AM
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత ఆస్తుల కోసం ఆమె వారసురాలిగా జె.దీప దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

ఆభరణాలను తమిళనాడుకు అప్పగించాలని హైకోర్టు ఆదేశం
బెంగళూరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత ఆస్తుల కోసం ఆమె వారసురాలిగా జె.దీప దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు సోమవారం కొట్టివేసింది. పోలీసులు జప్తు చేసిన ఆభరణాలు, వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ వి.శీర్షానంద నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం దీప పిటిషన్‌ను విచారించి, తీర్పునిచ్చింది.
గత ఏడాది మార్చి 6న తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత ఆభరణాలను అప్పగించాల్సి ఉంది. కానీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలతో తమ హక్కులకు భంగం కలుగుతోందని జయలలిత వారసురాలు జె.దీప హైకోర్టులో పిటిషన్ వేశారు.