DK Shivakumar: మా ఇద్దరిలో ఎవరైనా చెబితేనే నమ్మండి.. నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే
ABN , Publish Date - Nov 01 , 2025 | 07:14 PM
సీఎంతో మునుపటిలాగానే చక్కటి సమన్వయం కొనసాగుతోందని, అందరూ ఐక్యంతో ఉండటం వల్లే 136 నియోజకవర్గాల్లో గెలిచి 140కి బలం పెరిగిందని డీకే శివకుమార్ చెప్పారు.
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి కొట్టివేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో నేతలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. నాయకుడి కోసం మీడియానో, పార్టీలోని వారో వెతకాల్సిన అవసరం లేదని అన్నారు.
నాయకత్వ మార్పు విషయంపై తాను కానీ ముఖ్యమంత్రి కానీ చెబితేనే నమ్మాలని, ఇంకెవరు చెప్పినా దానికి విలువలేదని శనివారంనాడు కంఠీరవ స్టేడియంలో మీడియాతో మాట్లాడుతూ డీకే చెప్పారు. సీఎంతో మునుపటిలాగానే చక్కటి సమన్వయం కొనసాగుతోందని, అందరూ ఐక్యంతో ఉండటం వల్లే 136 నియోజకవర్గాల్లో గెలిచి 140కి బలం పెరిగిందని చెప్పారు.
ప్రతిపాదిత టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్‌ను బీజేపీ వ్యతిరేకించడటంపై మాట్లాడుతూ, అసెంబ్లీ విపక్ష నేత ఆర్.అశోక నాయకత్వంలో టన్నెల్ రోడ్ అంశంపై కమిటీ వేయడానికి తాను సిద్ధమేనని అన్నారు. నగరంలోని మౌలిక సదుపాయాలపై రెండు పార్టీలు కలిసి పనిచేసే విషయంలో తాను ఓపెన్‌గానే ఉన్నానని, బెంగుళూరు వ్యక్తిననే కారణంగా ప్రదర్శనలకు అశోక కూర్చోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక్కడ నుంచి ఏడెనిమిది సార్లు ఆయన కూడా గెలిచినందున ఆయనకు కూడా బాధ్యత ఉంటుందని అన్నారు. ఆయన నాయకత్వంలో కమిటీ ఏర్పడి ప్రభుత్వానికి తగిన సూచనలు చేయవచ్చన్నారు. ఎంట్రీ పాయింట్ల విషయంలో తాను కూడా లాల్‌బాగ్ సమీపంలోని ఏరియాలో పర్యటించానని, ప్రత్నామ్యాయ రూట్లు కూడా పరిశీలిస్తున్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మాతృభాషను బలహీన పరుస్తున్న హిందీ, ఇంగ్లీష్... సీఎం కీలక వ్యాఖ్యలు
ఇతర పార్టీలతో పొత్తులు ఉండవు: ప్రశాంత్ కిశోర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి