Share News

Tahawwur Rana Extradition: యూపీఏ హయాంలోనే ఎన్ఐఏ ఏర్పాటు: కపిల్ సిబల్

ABN , Publish Date - Apr 11 , 2025 | 02:42 PM

ముంబైలో 26/11 దాడి ఘటన జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇలాంటి ఉగ్ర ఘటనల్లో ప్రమేయమున్న వారిపై కఠిన చట్టం అవసరమైందని. యూపీఏ హయాంలోనే ఎన్ఐఏ ఏర్పిడిందని కపిల్ సిబల్ తెలిపారు.

Tahawwur Rana Extradition: యూపీఏ హయాంలోనే ఎన్ఐఏ ఏర్పాటు: కపిల్ సిబల్

న్యూఢిల్లీ: ముంబైలో 26/11 ఉగ్రదాడి ఫలితంగానే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆవిర్భావం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) తెలిపారు. ఉగ్రదాడి నిందితుడు తహవుర్ రాణా (Tahawwur Rana)‌ అరెస్టు నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ముంబై ఉగ్రదాడుల ఘటనలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు యూపీఏ హయాంలోనే సెంట్రర్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటయిందని చెప్పారు.

ముంబై టెర్రర్ అటాక్.. కసబ్ కోసం 28 కోట్లు ఖర్చు.. తహవ్వుర్ కోసం ఎంతవుతుందో..


"ముంబైలో 26/11 దాడి ఘటన జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇలాంటి ఉగ్ర ఘటనల్లో ప్రమేయమున్న వారిపై కఠిన చట్టం అవసరమైంది. యూపీఏ హయాంలోనే ఎన్ఐఏ ఏర్పిడిందని నాకు బాగా గుర్తు. ఈ ఘటనకు సంబంధించి 2009 నవంబర్ 11న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అందులో డేవిడ్ హెడ్లీ, తహవుర్ రాణా నిందితులుగా ఉన్నారు'' అని సిబల్ తెలిపారు. ఎన్ఐఏ జరిపిన ఇన్వెస్టిగేషన్‌ గురించి మరింత వివరిస్తూ, 2008 ముంబై టెర్రర్ అటాక్ కేసులో కొన్ని ఆరోపణలపై రాణాను అమెరికా విడిచిపెట్టడంపై ఎన్ఐఏ అసంతృప్తి వ్యక్తం చేసిందని, కస్టడీలో ఉన్న సహనిందితుడు హెడ్లీని ఎన్ఐఏ టీమ్ ప్రశ్నించి కుట్రను వెలికితీసిందని చెప్పారు.


''రాణాను చికాగోలో అరెస్టు చేశారు. కానీ ఆ తర్వాత విడుదల చేశారు. దీనిపై ఎన్ఐఏ అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2009 డిసెంబర్‌లో రాణా, హెడ్లీ, గుర్తుతెలియని మరికొందరిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. పరస్పర సహకారంతో ఎన్ఐఏ టీమ్ అమెరికా వెళ్లి కస్టడీలో ఉన్న హెడ్లీని ప్రశ్నించింది. కుట్ర మొత్తాన్ని బయటకు లాగింది'' అని సిబల్ తెలిపారు.


రెండు ప్రభుత్వాలకూ క్రెడిట్

రాణాను ఇండియాకు తీసుకురావడాన్ని కపిల్ సిబల్ స్వాగతించారు. గతంలోని యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి ఈ క్రెడిట్ దక్కుతుందని అన్నారు. రాణా అరెస్టుతో ఉగ్రదాడి కుట్రలో పాకిస్థాన్ ప్రమేయం బయటకువస్తుందని చెప్పారు. ప్రస్తుతం రాణా మనముందు ఉన్నారని, అయితే రాణా, హెడ్లే మాత్రమే కుట్రదారులు కాదని, ఇంకా చాలా మంది ప్రమేయం ఉందని, అది బయటకు రావాలని అన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇండియాకు తీసుకువచ్చిన రాణాను 18 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

Tahawwur Rana-Modi: తహవూర్ రాణా అప్పగింత.. మోదీ పాత ట్వీట్ వైరల్

Custody: తహవ్వుర్‌ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ

Updated Date - Apr 11 , 2025 | 02:46 PM