Share News

Kamal Hassan: కమల్ థగ్ లైఫ్‌ సినిమాపై నిషేధం.. కేఎఫ్‌సీసీ సంచలన నిర్ణయం

ABN , Publish Date - May 30 , 2025 | 05:15 PM

తమిళం నుంచి కన్నడం పుట్టిందంటూ గత వారం చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌లో కమల్ వ్యాఖ్యానించడంపై కన్నడ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి.

Kamal Hassan: కమల్ థగ్ లైఫ్‌ సినిమాపై నిషేధం.. కేఎఫ్‌సీసీ సంచలన నిర్ణయం

బెంగళూరు: ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ థగ్ లైఫ్‌ (Thug Life) చిత్రం విడుదలపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో సినిమా విడుదలపై నిషేధం విధిస్తున్నట్టు శుక్రవారం నాడు ప్రకటించింది. తమిళం నుంచి కన్నడం పుట్టిందంటూ గత వారం చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌లో కమల్ వ్యాఖ్యానించడంపై కన్నడ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, ఇందుకు కమల్ నిరాకరించారు. తన వ్యాఖ్యల్లో తప్పు ఉంటే క్షమాపణ చెప్పేవాడనంటూ ఆయన స్పందించడంతో కేఎఫ్‌సీసీ తాజా నిర్ణయం తీసుకుంది.


దీనిపై కేఎఫ్‌సీసీ ప్రతినిధి సా.రా.గోవిందు మీడియాతో మాట్లాడుతూ.. కమల్ తన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ సంస్థలు గట్టిపట్టుతో ఉన్నాయని, దీంతో సినిమా విడుదలపై నిషేధం విధించాలని నిర్ణయించామని చెప్పారు. కమల్ ఇంతవరకూ తన మాటల్లో ఎక్కడా సారీ చెప్పలేదని, దీంతో కన్నడ రక్ష వేదక, ఇతర కన్నడ సంస్థలు చేస్తున్న డిమాండ్‌కు తాము కట్టుబడి ఉంటామని చెప్పారు.


కాగా, కన్నడ ప్రతినిధులతో సమావేశానంతరం కేఎఫ్‌సీసీ అధ్యక్షుడు ఎం.నరసింహులు మీడియాతో మాట్లాడారు. సినిమాపై నిషేధం విధించాలని పలు కన్నడ సంస్థలు డిమాండ్‌ చేయడంతో వారితో తాము చర్చించామని, కమల్ తప్పుగా మాట్లాడినట్టు ఏకీభవిస్తున్నామని చెప్పారు. ఆయనను కలిసి మాట్లాడేందుకూ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.


మరోవైపు, కమల్‌ హాసన్ తన వ్యాఖ్యలు కేవలం ప్రేమతో చేసినవేనని, ఇందులో ఎలాంటి ఉద్దేశాలు లేవని వివరణ ఇచ్చారు. కర్ణాటక, ఆంధ్ర, కేరళపై తనకు ఎంతో అభిమానం ఉందని, వేరే ఎజెండాలు ఉన్న వారే తనను అనుమానిస్తున్నారని అన్నారు. నిజానికి భాష గురించి చెప్పే అర్హత రాజకీయ నాయకులకు ఉండదని, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, భాషా పండితులకే చెప్పే అర్హత ఉంటుందన్నారు.


ఇవి కూడా చదవండి..

కమల్‌ హాసన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్స్.. స్పందించిన నటుడు

పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా నిలుస్తాం

For National News And Telugu News

Updated Date - May 30 , 2025 | 05:38 PM