Kamal Haasan: కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్స్.. స్పందించిన నటుడు
ABN , Publish Date - May 30 , 2025 | 02:33 PM
కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటూ కొత్త వివాదానికి తెరతీసిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తాజాగా తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
చెన్నై: తమిళ భాష నుంచి కన్నడ పుట్టిందంటూ వివాదానికి తెరతీసిన ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యమ్ పార్టీ (ఎమ్ఎన్ఎమ్) అధినేత కమల్ హాసన్ ఈ విషయంపై మరోసారి స్పందించారు. తన వ్యాఖ్యల్లో తప్పు ఉంటే క్షమాపణలు చెప్పి ఉండేవాడినని అన్నారు. ‘నాకు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి. కానీ ఎప్పటికైనా విజయం ప్రేమదే. కర్ణాటక, ఆంధ్ర, కేరళపై నాకున్న అభిమానం నిజం. వేరే అజెండాలు ఉన్న వారే నన్ను అనుమానిస్తారు’ అని కమల్ హసన్ స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యమని, చట్టం, న్యాయంపై తనకు నమ్మకం ఉందని అన్నారు.
థగ్ లైఫ్ సినిమా ప్రచారంలో భాగంగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కన్నడ భాషపై కమల్ వ్యాఖ్యలు చేశారు. తమిళమే తన జీవితం, ఆత్మ అంటూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా తన కుటుంబమే అని కమల్ అన్నారు. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యానించారు.
కమల్ వ్యాఖ్యలపై కర్ణాటకలో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. కన్నడ భాషాభిమానులతోపాటు రాజకీయ నాయకులూ కమల్ హాసన్‌పై విమర్శలు గుప్పించారు. సీఎం సిద్దరామయ్య సైతం విమర్శలు ఎక్కుపెట్టారు. కన్నడ భాష గురించి కమల్ హాసన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్షనేత అశోక్ తదితరులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. కమల్ మంచి నటుడు కావచ్చని, అయినంత మాత్రాన నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు.
ఇక కమల్‌హాసన్ త్వరలో ఎంపీగా రాజ్యసభలో కాలుపెట్టనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అధికార డీఎమ్‌కేతో కుదిరిన ఒప్పందం ప్రకారం, ఎమ్ఎన్ఎమ్ పార్టీకి రాజ్యసభ సీటు కేటాయించారు. ఈ సీటుకు అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైంది. ఈ విషయాన్ని తమిళనాడు అధికార పార్టీ వర్గాలు కూడా నిర్ధారించాయి.
ఇవీ చదవండి:
అమెరికా ఇప్పటివరకూ 1080 మంది భారతీయుల్ని డిపోర్టు చేసింది: విదేశాంగ శాఖ
ఆపరేషన్ సిందూర్‌తో దీటైన జవాబిచ్చాం.. సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి